ఇద్దరు మైనర్లపై అత్యాచారయత్నం
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:03 AM
నిర్మల్‌కు చెందిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నం చేశారు...
గంజాయి మత్తులో అఘాయిత్యం
అనాథ బాలికలను అపహరించి.. ఇద్దరు యువకుల దుశ్చర్య
నిర్మల్‌లో ఘటన.. నిందితుల అరెస్టు
నిర్మల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌కు చెందిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నం చేశారు. బాధిత బాలికల్లో ఒకరు అదృష్టవసాత్తు ఆ కిరాతకుల చెర నుంచి తప్పించుకోవడంతో విషయం పోలీసుల దృష్టికి చేరగా.. బాలికలిద్దరూ దుర్మార్గుల బారి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు బాలికలు నిర్మల్‌లోని ఓ ప్రాంతంలో నివాసముంటున్నారు. బాలికలు నివాసముండే ప్రాంతానికి చెందిన అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీమ్ అనే యువకులు గంజాయికి బానిసలై నిత్యం జులాయిగా తిరుగుతుంటారు. అయితే, గంజాయి మత్తులో ఉన్న అబ్బాస్ ఖాన్, షేక్ ఖలీమ్ శనివారం అర్ధరాత్రి తర్వాత ఆ బాలికల ఇంటికి వెళ్లి వారిని అపహరించారు. సమీపంలోని పోచంపాడ్(నిజామాబాద్ జిల్లా) ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అబ్బాస్, ఖలీమ్ ఓ బాలికపై అత్యాచారానికి యత్నించగా.. భయపడిన మరో బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది. స్థానికులకు జరిగిన విషయం చెప్పి సాయం కోరింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అబ్బాస్, ఖలీమ్ అప్పటికే పరారవ్వగా.. బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. బాధితులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.