Share News

ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:44 AM

ఒకే బాటిల్‌లోని మద్యంతాగిన ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యా....

ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి

  • కల్తీ మద్యమా?, విష ప్రయోగమా?.. పోలీసుల దర్యాప్తు

  • మహబూబాబాద్‌ జిల్లా భూక్యా తండాలో విషాదం

మరిపెడ రూరల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఒకే బాటిల్‌లోని మద్యంతాగిన ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యా తండాలో మంగళవారం జరిగింది. తండాకు చెందిన శారద (40) కుమారుడితో కలిసి సూర్యాపేట జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం సాయంత్రం తిరిగొస్తూ, సూర్యాపేటలోని ఓ వైన్స్‌ షాపులో మద్యం కొనుగోలు చేసి తెచ్చింది. రాత్రి శారద ఇంటికి ఆమె స్నేహితురాలు నీల (42)రాగా, వారిద్దరూ ఆ మద్యాన్ని తాగారు. కొద్దిసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే శారద, నీల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ మద్యంలో ఎవరైనా విషం కలిపారా? లేక అది కల్తీ మద్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మహిళలిద్దరూ వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 05:44 AM