ఇద్దరు మహిళల సజీవ దహనం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:05 AM
ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు.
వేలేరుపాడులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
ప్రమాదమా?.. బంగారం కోసం హత్యా?
బంధువుల అనుమానం.. పక్కనున్న ఇల్లూ దగ్ధం
విచారణకు ఎంపీ, ఎమ్మెల్యేల ఆదేశం
వేలేరుపాడు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. అయితే, ఇది ప్రమాదమా? హత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వలగాని సావిత్రి(60), పూలమ్మ(65) ఇద్దరికీ.. భర్తలు చనిపోవడంతో రేకుల షెడ్డు ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. మద్యం అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిద్రపోయిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో వీరి ఇంటిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు చూసి కుక్కునూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పుతున్న క్రమంలో కాలిపోయి మాంసపు ముద్దలుగా రెండు మృతదేహాలు కనిపించాయి. దీంతో ఇది ప్రమాదమా? హత్యా అని అటు స్థానికులతోపాటు మృతురాళ్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుసుకున్న వారెవరో వారిద్దరినీ హత్య చేసి ఆపై అనుమానం రాకుండా ఇంటికి నిప్పు పెట్టి ఉంటారని అంటున్నారు. సావిత్రి వద్ద 15 తులాల బంగారంతోపాటు వెండి వస్తువులు భారీగానే ఉన్నాయని, అవి కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు ఆస్కారం లభిస్తోంది. బాగా తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో సావిత్రి ఇంటిపక్కనే ఉన్న ఆమె బంధువు ఉప్పల లక్ష్మి ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. కుక్కునూరు సీఐ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలీసులకు సూచించారు. వేలేరుపాడు వెళ్లి ఘటనా స్థలాన్నిపరిశీలించి బాధిత బంధువులను పరామర్శించారు.
సమగ్ర విచారణ: ఎంపీ మహేశ్
ఏలూరు టూ టౌన్: వేలేరుపాడులో మహిళల మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఏలూరు ఎంపీ మహేశ్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. ఇద్దరు మహిళల మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. స్థానిక సీఐ రమేశ్‌తో మాట్లాడి ఇందులో కుట్రకోణం ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.