Share News

భార్యపై కోపంతో కవలల ప్రాణం తీశాడు!

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:07 AM

భార్యపై మనసుతో ఉన్న కోపాన్నంతా అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలపై చూపాడా భర్త. ఐదేళ్ల వయసున్న కవలలను బావిలోకి తోసి ప్రాణాలు తీశాడు...

భార్యపై కోపంతో కవలల ప్రాణం తీశాడు!

  • బావిలోకి తోసి హత్య.. కన్నతండ్రి దారుణం

  • ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యతో గొడవ

  • కరీంనగర్‌ రూరల్‌ జూబ్లీనగర్‌లో ఘటన

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): భార్యపై మనసుతో ఉన్న కోపాన్నంతా అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలపై చూపాడా భర్త. ఐదేళ్ల వయసున్న కవలలను బావిలోకి తోసి ప్రాణాలు తీశాడు. కరీంనగర్‌ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు కరీంనగర్‌ రూరల్‌ మండలం జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలం. భార్య మౌనికతో విబేధాలు తలెత్తడంతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మౌనిక పుట్టిల్లు మానకొండూర్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామం. శ్రీశైలం-మౌనికకు 2020లో పెళ్లయింది. వీరికి గీతాన్షి (5), గీతాన్షిక (5) అనే కవలలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారనే అసంతృప్తితో ఉన్న శ్రీశైలం, తరచూ భార్యతో గొడవపడేవాడు. అతడు భార్యతో కలిసి కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నాడు. అక్కడ ఓ చిట్‌ఫండ్స్‌ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. హైదరాబాద్‌లో ఉంటే తాను కాపురానికి రానని భార్య చెప్పటంతో ఆరు నెలల క్రితమే కుటుంబంతో కలిసి సొంతూరైన జూబ్లీనగర్‌కు మకాం మర్చాడు. దగ్గర్లోని ఓ మెడికల్‌ కళాశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం శ్రీశైలం.. తన ఇంటికి రెండు కి.మీ దూరంలోని ఉన్న తన వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలను పడేశాడు. ఇంటికొచ్చిన భర్తను పిల్లలేరి? అని మౌనిక ప్రశ్నిస్తే తానే బావిలో పడేసినట్లు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావిలో గాలించారు. గీతాన్షి మృతదేహం నీళ్లపై తేలడంతో వెంటనే బయటకు తీసినా.. గీతాన్షిక కోసం గంటల తరబడి గాలించాల్సి వచ్చింది. బాగా చీకటిపడ్డాక ఆ పాప మృతదేహం లభ్యమైంది. అయితే తాను ఇద్దరు పిల్లలను బావి వద్దకు ఆడుకునేందుకు తీసుకువెళ్ళానని, వారు ఆడుకుంటూ బావిలో పడిపోగా తాను కూడా దూకానని శ్రీశైలం కొత్త కథ అల్లాడు. అయితే పిల్లలను శ్రీశైలమే బావిలో పడేసి హత్య చేశాడని మౌనిక, గ్రామస్థులు ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో గ్రామస్థులు శ్రీశైలాన్ని చితకబాదారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కాగా మౌనిక కుటుంబసభ్యులు, గ్రామానికి చెందిన బంధువులు పెద్ద సంఖ్యలో జూబ్లీనగర్‌కు చేరుకొని శ్రీశైలం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో, బావి వద్ద పెద్ద సంఖ్యలు గ్రామస్థులు, ప్రజలు గుమికూడటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 04 , 2026 | 05:07 AM