Share News

జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులు

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:41 AM

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తోటి ట్రైనీ అధికారి తనపై లైంగిక వేధింపులకు...

జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులు

  • తోటి ట్రైనీ ఐపీఎస్‌పై ట్రైనీ మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదు

  • బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి వేధించారని..గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని ఆరోపణలు

  • కేసు నమోదు చేసిన అత్తాపూర్‌ పోలీసులు

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌/అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తోటి ట్రైనీ అధికారి తనపై లైంగిక వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డారని శిక్షణలో ఉన్న ఒక మహిళా ఐపీఎస్‌ ఆదివారం అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని, మహిళా అధికారి వాంగ్మూలం తీసుకుని, తగిన చర్యలు చేపడతామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు.

అసభ్య సందేశాలు, దూషణలతో..

హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో ప్రస్తుతం 2024 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణ పొందుతున్నవారిలో ఏపీకి చెందిన ఉదయకృష్ణారెడ్డి.. గతనెల 23వ తేదీ నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కర్ణాటకలోని హల్లిమైసూర్‌ ప్రాంతానికి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వాట్సా్‌పలో అసభ్య సందేశాలు పంపుతున్నారని, శిక్షణలోని ఇతర ఐపీఎస్‌ల ముందు అభ్యంతరకరంగా నిందించారని ఆరోపించారు. అంతేగాకుండా తనకు అకాడమీలోనే మరొకరితో అతిచనువు ఉందని ప్రచారం చేశారని, ఆ విషయాన్ని అందరి ముందు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి తాను అంగీకరించలేదని.. దీనితో ఉదయకృష్ణారెడ్డి ఈ నెల 8న తన ఫోన్‌ లాక్కుని, గదిలోకి తీసుకెళ్లారని.. ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పాలని వేధించారని, అసభ్యంగా తాకుతూ అభ్యంతరకర చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తనను బలవంతంగా ఉదయకృష్ణారెడ్డి గదికి తీసుకెళ్లారని.. తన జుట్టు పట్టుకుని, గొంతునొక్కారని, గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని, తనపై కండోమ్‌ ప్యాకెట్లు విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ నెల 10న ఉదయం 7.50 గంటల సమయంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు సమాచారాన్ని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.


కానిస్టేబుల్‌గా పనిచేసి.. ఐపీఎస్‌కు ఎంపికై..

ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొంద మండలానికి చెందిన ఉదయకృష్ణారెడ్డికి ‘కానిస్టేబుల్‌ టు ఐపీఎస్‌’గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండటం గమనార్హం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన.. నాయనమ్మ సంరక్షణలో పెరిగి చదువుకున్నారు. 2012లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. 2018లో ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అందరి ముందు ఒక సీఐ చేతిలో తీవ్ర అవమానానికి గురయ్యారు. మనస్తాపంతో రాజీనామా చేశారు. ఐపీఎస్‌ కావాలనే లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2019 నుంచి నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2024లో 350వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇప్పుడిలా ఆరోపణలు ఎదుర్కోవడంపై సోషల్‌ మీడియాలోనే ప్రతికూల కామెంట్లు వస్తున్నాయి.

Updated Date - Jul 20 , 2026 | 03:41 AM