Share News

రైళ్లలో దొంగల హల్‌చల్‌!

ABN , Publish Date - May 26 , 2026 | 05:17 AM

రైళ్లలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ హడలెత్తిసున్నారు. బ్యాగ్‌లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు.

రైళ్లలో దొంగల హల్‌చల్‌!

  • హరియాణా, బిహార్‌, రాజస్థాన్‌, అసోం నుంచి ముఠాలు

  • ప్రయాణికుల బ్యాగులు, మెడలోని బంగారు నగలు చోరీ

  • మత్తుమందు చల్లి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు అపహరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైళ్లలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ హడలెత్తిసున్నారు. బ్యాగ్‌లు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు. సిగ్నల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ అంతర్రాష్ట్ర ముఠాలు రైల్వే పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. మహారాష్ట్ర, బిహార్‌, జార్ఖండ్‌, అస్సాం, రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌లు రైళ్లలో ప్రయాణికులను కొల్లగొడుతున్నారు. రైళ్లలో చోరీలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసిన జీఆర్‌పీ.. ఈ ముఠాలపై కఠిన చర్యలు తీసుకొనే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దృష్టి మళ్లించి చేతివాటం

మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన దొంగల ముఠా ఏలూరు, విజయవాడ, నరసరావుపేట ప్రాంతాల్లో రైళ్లలో ప్రయాణిస్తూ బ్యాగ్‌లు చోరీ చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఎక్కువమంది పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్తుంటారు. వేడుకల్లో ధరించేందుకు వెంట తెచ్చుకున్న బంగారు నగల బ్యాగ్‌ను, సూట్‌కేసులను దొంగలు క్షణాల్లో అపహరించి, రైలు దిగి పారిపోతున్నారు. రైలు తలుపు వద్ద నిలబడి మహిళల మెడలో చైన్లు లాక్కొని రెప్పపాటులో కిందకు దూకేస్తున్నారు. బిహార్‌కు చెందిన మరో గ్యాంగ్‌ పలాస నుంచి విశాఖపట్నం వరకూ దోపిడీలు చేస్తోంది. జార్ఖండ్‌లోని జామ్‌తారా జిల్లాకు చెందిన మరో గ్యాంగ్‌ విజయవాడ కేంద్రంగా దోపిడీలకు పాల్పడుతోంది. ఈ ముఠా సభ్యులు ఆహారం, పానీయాల్లో మత్తు కలిపి ప్రయాణికులను దోచేస్తున్నారు. వీరితో పాటు రాజస్థాన్‌, అస్సాం, హరియాణాకు చెందిన సంజూరాయ్‌ గ్యాంగ్‌ గుంటూరు పరిధిలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్లు స్నాచింగ్‌లు చేస్తున్నట్లు జీఆర్‌పీకి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దోపిడీలు చేసేందుకు వచ్చిన ఐదు ప్రధాన గ్యాంగ్‌లను గుర్తించిన రైల్వే పోలీసులు రాత్రివేళల్లో సాయుధులై బోగీల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.


సిగ్నల్‌ ట్యాంపరింగ్‌తో భద్రతకు ముప్పు

రైళ్లలో దోపిడీకి అనువుగా సిగ్నల్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాల చర్యలు భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఒక రైలులో దొంగతనం చేసుకుని కిందికి దిగిపోయే దొంగలు అటువైపు నుంచి వచ్చే మరో రైలు వివరాలు తెలుసుకుని సిగ్నల్‌ వైర్‌ కట్‌ చేస్తున్నారు. రైలు వేగం తగ్గిన తర్వాత లోపలకు ప్రవేశిస్తున్నారు. బుధవారం నిడుబ్రోలు వద్ద దొంగలు వదిలేసిన కట్టర్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 18 సార్లు సిగ్నల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడగా 16 ఘటనల్లో బాధ్యుల్ని గుర్తించారు. 2026లో కేవలం 2 ఘటనలే నమోదు కావడం జీఆర్‌పీ పనితీరుకు నిదర్శనం. మరోవైపు రైళ్లలో దొంగతనాలు ఏటా పెరుగుతున్నాయి. 2024 వేసవిలో 53 కేసులు, 2025లో 45 కేసులను రైల్వే పోలీసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 57 కేసులు నమోదయ్యాయి. రైల్వేలో భద్రత కోసం 2025లో 3.58 లక్షల తనిఖీలు నిర్వహించి 341 మంది అనుమానితులు, దొంగల్ని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. 2026లో ఏప్రిల్‌ వరకూ 96 వేలకు పైగా తనిఖీలు నిర్వహించి 59మందిని గుర్తించామని వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం 488 మంది జీఆర్‌పీ సిబ్బంది 96 ట్రైన్‌ బీట్లలో పహరా కాస్తున్నట్లు చెప్పారు. గుంతకల్లు, తిరుపతి, నెల్లూరు మధ్యలో సాయుధ పోలీసులు బృందాలుగా రాత్రి విధులు నిర్వహిస్తున్నారని డీఐజీ పేర్కొన్నారు.

139కు ఫిర్యాదు చేయాలి

రైళ్లలో ప్రయాణించే సమయంలో అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు ధరించకుండా జాగ్రత్త పడాలని, బోగీల్లో తలుపుల వద్ద అనుమానాస్పదంగా సంచరించే వారిపై టోల్‌ ఫ్రీ నం.139కు సమాచారం ఇవ్వాలని పేర్కొంటున్నారు. బ్యాగులు, ఇతరత్రా విలువైన వస్తువులు అపహరణకు గురైతే ‘రైల్‌ మదద్‌’ యాప్‌లో లేదా జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - May 26 , 2026 | 05:18 AM