Share News

ప్రియురాలిని చంపిన ప్రియుడు

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:58 AM

సహజీవన బంధంలో మొదలైన గొడవ తారస్థాయికి చేరి చివరకు రక్తపాతానికి దారితీసింది. ప్రియురాలిని అతికిరాతకంగా హతమార్చిన ప్రియుడు, ఆపై ఆమె బంధువుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు.

ప్రియురాలిని చంపిన ప్రియుడు

  • ఆపై ఆమె బంధువుల చేతిలో ప్రియుడి హతం

  • సహజీవనం చేస్తున్న జంట దారుణ హత్య

  • నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

బోధన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సహజీవన బంధంలో మొదలైన గొడవ తారస్థాయికి చేరి చివరకు రక్తపాతానికి దారితీసింది. ప్రియురాలిని అతికిరాతకంగా హతమార్చిన ప్రియుడు, ఆపై ఆమె బంధువుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిలాలో మంగళవారం చోటుచేసుకుంది. వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన పాత్‌లోత్‌ కవిత(36)కు 15ఏళ్ల క్రితం సంతోష్‌ అనే వ్యక్తితో వివాహం కాగా, అతడు 10 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి 12 కూతురు ఉంది. కాగా, 6ఏళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన వివాహితుడైన లాకవత్‌ ఆనంద్‌(39)తో సహజీవనం చేస్తోంది. అయితే, తన కూతురు పెద్దదవుతోందని, ఇకపై సహజీవనం కొనసాగించడం సరికాదని భావించిన కవిత.. ఇదే విషయాన్ని ఆనంద్‌ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక నుంచి వేర్వేరుగా ఉందామని కవిత తేల్చి చెప్పడంతో మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య మొదలైన గొడవ హింసకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన ఆనంద్‌ పొలంలో పనికి ఉపయోగించే పారతో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో కవిత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణాన్ని గమనించిన కవిత బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పంట పొలాల్లో దాక్కున్న ఆనంద్‌ వద్దకు వెళ్లి కర్రలు, రాళ్లతో సామూహికంగా దాడిచేశారు. బంధువుల దేహశుద్ధిలో తీవ్ర గాయాలపాలై మరణించాడు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బోధన్‌ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయిన చిన్నారికి.. ఇప్పుడు తల్లి హత్యకు గురవ్వడంతో అనాఽథగా మారింది. చిన్నారి రోదనలు చూపరులకు కంట తడి పెట్టించాయి.

Updated Date - Apr 29 , 2026 | 06:59 AM