Share News

పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. పిల్లల గొంతు నులిమి.. గృహిణి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:27 AM

పెళ్లి రోజు సరదాగా షాపింగ్‌కు వెళదామని భర్తను కోరిందామె! అయితే తండ్రికి డయాలసిస్‌ చేయించాల్సి ఉండటంతో కుదరదు అని భర్త నచ్చజెప్పాడు.

పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. పిల్లల గొంతు నులిమి.. గృహిణి ఆత్మహత్య

  • కుమారుడి మృతి.. చికిత్స పొందుతున్న కుమార్తె

  • బోరబండ పెద్దమ్మనగర్‌లో దారుణం

బోరబండ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పెళ్లి రోజు సరదాగా షాపింగ్‌కు వెళదామని భర్తను కోరిందామె! అయితే తండ్రికి డయాలసిస్‌ చేయించాల్సి ఉండటంతో కుదరదు అని భర్త నచ్చజెప్పాడు. ఆ మాత్రానికే తీవ్ర మనస్తాపానికి గురై ఆమె.. ఒడిగట్టిన ఘాతుకం స్థానికంగా తీవ్ర సంచలనమైంది. బోరబండ పరిధిలోని పెద్దమ్మనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మురళి వేణు కుటుంబం గత కొన్నేళ్లుగా పెద్దమ్మనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. మురళి విద్యుత్తు శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఏడేళ్ల క్రితం సత్యవేణి (30)తో వివాహమైంది. వారికి కుమారుడు రుద్రాన్ష్‌ (5), కూతురు ధన్విక (2) ఉన్నారు. అతడి తల్లిదండ్రులు కూడా మురళితోనే ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికీ మురళి, సత్యవేణి గొడవపడేవారు. శుక్రవారం వివాహ వార్షికోత్సవం కావడంతో పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లి సరదాగా తిరిగొద్దామని భర్తను సత్యవేణి కోరింది. ఇందుకు మురళి ఒప్పుకోలేదు. తండ్రి సత్యనారాయణను డయాలసిస్‌ చేయించేందుకు తీసుకువెళ్లాల్సి ఉందని, మరోరోజు బయటకు వెళ్దామని ఆమెకు నచ్చజెప్పాడు. మరికొద్ది సేపటికి వేడినీళ్ల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత తండ్రిని తీసుకొని మురళి ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లాడు. మురళి తల్లి మంగాదేవి డ్యూటీ చేసేందుకు వెళ్లింది. అప్పటికే భర్త తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యవేణి ఇంటి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. టీవీ ఆన్‌ చేసి.. పెద్దగా సౌండ్‌ పెట్టింది. అనంతరం రుద్రాన్ష్‌, ధన్విక గొంతు నులిమింది. వారు స్పృహతప్పి పడిపోవడంతో తాను ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి తిరిగొచ్చిన మురళి తల్లి మంగాదేవి తలుపులు కొట్టినా ఎవ్వరూ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. లోపల సత్యవేణి ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో షాక్‌కు గురైంది. బోరబండ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా అప్పటికే సత్యవేణి, రుద్రాన్ష్‌ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న ధన్వికను నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సత్యవేణి ఆత్మహత్యకు భర్త, ఆమె, అత్తామామలే కారణమని మృతురాలి వదిన బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - Mar 15 , 2026 | 06:31 AM