ప్రాణాలు తీసిన ఈత సరదా
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:24 AM
సరదాగా ఈతకొట్టడానికి వెళ్లిన ముగ్గురు బాలురు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన...
మత్స్యగెడ్డ పాయలో మునిగి ముగ్గురు గిరిజన బాలురు మృతి
అల్లూరి జిల్లా పన్నెడలో ఘటన
పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా), ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఈతకొట్టడానికి వెళ్లిన ముగ్గురు బాలురు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన గల్లోంగి హర్షిత్ (10), కోడా ప్రదీప్ (10), పాంగి బబ్లూ(8), పాంగి నవీన్, కోడా కార్తిక్ ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం గ్రామానికి సమీపంలో ఉన్న మత్స్యగడ్డ పాయలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఒకరి తరువాత ఒకరు నీటిలో దిగారు. కొంచెం లోపలికి వెళ్లిన తరువాత ఒక్కసారిగా లోతు పెరగడంతో హర్షిత్, ప్రదీప్, బబ్లూ, పాంగి నవీన్ నీటిలో మునిగిపోతూ పెద్దగా కేకలు వేశారు. దీంతో కార్తిక్ బయటకు వచ్చి పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో చేపలు పడుతున్న యువకులు వచ్చి నవీన్‌ను కాపాడారు. మిగిలిన ముగ్గురు నీటిలో మునిగిపోయారు. గ్రామానికి వెళ్లి సంఘటన గురించి చెప్పగా కుటుంబ సభ్యులు వచ్చి గెడ్డలో గాలించి, మృతదేహాలను బయటకు తీశారు. మృతిచెందిన హర్షిత్, ప్రదీప్ ఐదో తరగతి, బబ్లూ మూడో తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముంచంగిపట్టు సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు.