కుమారుని ఆచూకీ లభించలేదని...బావిలో దూకి తండ్రి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:55 AM
కుమారుడు కనిపించడం లేదన్న ఆందోళనతో తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చి బావిలో గాలించగా అనూహ్యంగా తండ్రితో పాటు కుమారుడి మృతదేహం....
అదే బావిలో కుమారుడి మృతదేహం కూడా గుర్తింపు
కేశంపేట, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కుమారుడు కనిపించడం లేదన్న ఆందోళనతో తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చి బావిలో గాలించగా అనూహ్యంగా తండ్రితో పాటు కుమారుడి మృతదేహం కూడా బయటపడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపుర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని పాపిరెడ్డిగూడకు చెందిన తూర్పాటి యాదయ్య (40).. భార్య సరిత ముగ్గురి పిల్లలతో కలసి సంతాపుర్ గ్రామంలోని రఫిఖ్ అనే రైతు వద్ద వ్యవసాయ పనుల ఇటీవలు నిమిత్తం చేరాడు. ఈ క్రమంలో యాదయ్య పెద్ద కుమారుడు కన్నయ్య (11) శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. బాబు ఆచూకీ దొరకకపోవడంతో ఆదివారం కేశంపేట పోలీస్ స్టేషన్‌లో యాదయ్య ఫిర్యాదు చేశాడు. అదేరోజు తన భార్య పిల్లలతో కలిసి ఫరూఖ్‌నగర్ మండలం గంట్లవెల్లిలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ తప్పిపోయిన బాలుడి విషయంలో భార్య, భర్తలు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం తిరిగి సంతాపుర్‌కు వచ్చి వారు పనిచేస్తున్న వ్యవసాయ క్షేత్రం చుట్టుపక్కల వెతికారు. కానీ ఆచూకీ లభించకపోవడంతో అదే పొలం వద్ద ఉన్న బావిలో దూకి యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు రెస్క్యూ సిబ్బందితో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో మొదట బాలుడు కన్నయ్య మృతదేహం, ఆ తర్వాత యాదయ్య మృతదేహం బయట పడ్డాయి. తండ్రి దూకిన బావిలోనే కుమారుడి మృతదేహం కూడా లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు.