భర్తను చంపేసి.. పెరట్లో పాతేసి..
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:11 AM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం
బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెకు బెదిరింపు
మూడు నెలల తర్వాత వెలుగులోకి.. అనంతలో దారుణం
కళ్యాణదుర్గం రూరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది. విషయం బయటకు చెబితే చంపేస్తానని కన్న కూతుర్ని కూడా బెదిరించింది. అలా 3 నెలలపాటు విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టింది. ఆ తర్వాత కన్న కుమార్తెను సైతం చంపేందుకు ప్రయత్నించగా.. ఆ బాలిక తప్పించుకుని వెళ్లి బంధువులకు విషయం చెప్పింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో ఆ దారుణ ఘటన చోటుచేసుకుంది. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతరాయుడు (43), కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన సుకన్య సుమారు 18ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. వీరు సుమారు 15 ఏళ్లుగా కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో ఉంటూ, గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుకన్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి భర్త హనుమంతరాయుడు అడ్డుగా ఉన్నాడనే కారణంగా 3 నెలల క్రితం రోకలి బండలో కొట్టి చంపేసింది. మృతదేహాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టింది. ఈ విషయం ఇంటర్ చదువుతున్న కూతురు అమృతకు తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తల్లి బెదిరించడంతో ఆమె మౌనం వహించింది. ఈ క్రమంలో తల్లీకూతుళ్ల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. కూతురు అమృతను హతమార్చడానికి తల్లి యత్నించగా.. ఆమె తప్పించుకుని పారిపోయింది. తన తండ్రి స్వగ్రామం హనిమిరెడ్డిపల్లికి చేరుకుని, బంధువులకు విషయం చెప్పింది. బంధువులందరూ పాతచెరువుకు చేరుకునేలోగా సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తామని తెలిపారు.