Share News

ఒంటరి మహిళలే టార్గెట్‌!

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:12 AM

ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌. ప్రాణాలు తీసిమరీ దోపిడీ చేస్తాడు. అలాంటి నేరస్థుడిని తిరుపతి జిల్లా పోలీసులు గతంలోనే అరెస్ట్‌ చేశారు.

ఒంటరి మహిళలే టార్గెట్‌!

  • ప్రాణాలు తీసి మరీ దోపిడీలు.. తిరుపతి జిల్లాలోనే 4 హత్యలు

  • 3 రాష్ట్రాల్లో 21 కేసులు.. మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడి దురాగతాలు

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌. ప్రాణాలు తీసిమరీ దోపిడీ చేస్తాడు. అలాంటి నేరస్థుడిని తిరుపతి జిల్లా పోలీసులు గతంలోనే అరెస్ట్‌ చేశారు. అతడిపై అనుమానంతో కస్టడీకి తీసుకుని విచారించగా మరిన్ని నేరాలు వెలుగులోకి రావడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు కేసు వివరాలను తెలియజేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి 11న ఓ మహిళ హత్య, దోపిడీ జరిగింది. పి.విశ్వనాథ్‌ అలియాస్‌ ప్రశాంత్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. అయితే జిల్లాలో ఒంటరి మహిళల హత్య, దోపిడీ ఘటనలు మరిన్ని ఉండటంతో విశ్వనాథ్‌పై అనుమానంతో కోర్టు ద్వారా ఈనెల 5న కస్టడీలోకి తీసుకుని విచారించారు. దీంతో అతడి నేరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అసలు పేరు ఏఎం అజీజ్‌ అలియాస్‌ అబ్దుల్‌ అలియాస్‌ కర్ణాటక అజీజ్‌ (39)గా గుర్తించారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాకు చెందిన అతనిపై తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల్లో 21 కేసులున్నాయి. 2018లో కేరళలో పోలీస్‌ ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఆ తర్వాత అజీజ్‌ నేరుగా తిరుపతికి చేరుకున్నాడు.


పి.విశ్వనాథ్‌ అనే వ్యక్తి ఆధార్‌ కార్డును తనదిగా వినియోగిస్తూ.. హోటళ్లలో పనిచేసేవాడు. తనతోపాటు పనిచేస్తున్న వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మ సహకారంతో ఆటో కొనుగోలు చేసి, అదే వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరూ నేరాలకు పాల్పడేవారు. ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి, అదను చూసి హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచుకోవడం మొదలుపెట్టారు. ఈక్రమంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ‘మర్డర్‌ ఫర్‌ గెయిన్‌’ కేసులు, తిరుపతి క్రైం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక దోపిడీ కేసు, పిచ్చాటూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్య కేసు సహా మొత్తం నాలుగు కీలక కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడి వాంగ్మూలం మేరకు రాజమ్మను కూడా అరెస్ట్‌ చేసి 76 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి ఆభరణాలు, నిందితుడి వద్ద నుంచి 51.5 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.21.5 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు.

Updated Date - Apr 13 , 2026 | 05:18 AM