వావివరసలు మరిచి..వదిన కూతురిపై అత్యాచారం
ABN , Publish Date - May 23 , 2026 | 06:34 AM
వావి వరసలు మరిచి.. తన భార్య అక్క కూతురైన 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రభుత్వోద్యోగితో పాటు అతడికి సహకరించిన అతడి భార్యనూ పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతిలో ఉన్నతాధికారి అరెస్ట్
భార్య.. డిప్యూటీ తహశీల్దార్‌కూ రిమాండ్
బాధితురాలిది హైదరాబాద్.. అక్కడే జీరో ఎఫ్‌ఐఆర్
వేసవి సెలవులకు వచ్చిన బాలికపై దారుణం
తిరుపతి (నేరవిభాగం), మే 22(ఆంధ్రజ్యోతి): వావి వరసలు మరిచి.. తన భార్య అక్క కూతురైన 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రభుత్వోద్యోగితో పాటు అతడికి సహకరించిన అతడి భార్యనూ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాఽధికారి (51) ఇంటికి ఆయన వదిన కుమార్తె ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా వచ్చింది. వరసకు చిన్నాన్నే కావడంతో ఆయనతో బాలిక చనువుగా మెలిగింది. దీంతో బాలికపై కన్నేసిన అతడు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న సందర్భాలను ఫొటోలు తీశాడు. ఆపై ఆ ఫొటోలను, చాట్‌లను చూపుతూ.. తన వద్దకు రాకపోతే వాటిని షోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అలాగే ఈ విషయాలు బయటికి చెప్తే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇంట్లోనే కాకుండా బయటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు హైదరాబాద్‌లోని తమ ఇంటికి చేరిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. తెలంగాణలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయత్రం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి లైంగిక దాడుల విషయం తెలిసీ, వారించకపోగా.. అతడిని కాపాడేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.