తిరుమలలో రెండు గ్యాంగ్‌ల మధ్య కొట్లాట
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:10 AM
ప్రశాంతమైన తిరుమలలో రెండు గ్యాంగులు దాడి చేసుకుని భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి.
వంట సామగ్రితో పరస్పర దాడులు
భయంతో పరుగులు తీసిన భక్తులు
క్యూలైన్లలో అనధికార వ్యాపారంలో ఆధిపత్యపోరే కారణం
తిరుమల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతమైన తిరుమలలో రెండు గ్యాంగులు దాడి చేసుకుని భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. భద్రతావైఫల్యంతోనే రెచ్చిపోయి రాత్రి వేళలో వీరంగం చేశాయని భక్తులు వాపోతున్నారు. కొంతకాలంగా తిరుమలలోని క్యూలైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలు, షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. వీరే మద్యం మత్తులో నిత్యం ఏదో రకమైన దాడులతో తిరుమల వార్తల్లోకి ఎక్కేలా వ్యవహరిస్తున్నారు. సర్వదర్శన క్యూలైన్ వద్ద అనధికారికంగా కూల్‌డ్రింక్స్ విక్రయించే రెండు వర్గాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన లక్ష్మీదేవి, శక్తిబాలాజీ, దిలీప్, పవన్, శివకుమార్, మురుగ, విజయ్‌కుమార్ ఒక వర్గంగా, గోగుల కోటి, తోట ధీరజ్‌కుమార్, గోగుల శ్రీకాంత్, శ్రీనివాసులు, చరణ్, సాయి మరో వర్గంగా విడిపోయి శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగారు. మాటలతో మొదలైన గొడవ పరస్పరం దాడి చేసుకునే స్థితికి చేరుకుంది. డీఎంబీ రోడ్డులోని ఒక హోటల్‌లో ఉన్న వంట సామగ్రితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తప్పించుకున్న ఇద్దరు యువకులు లేపాక్షి సర్కిల్ కిందిభాగంలోని బ్రిడ్జి కిందకు వచ్చిపడిపోయారు. రక్తపు మరకలతో ఉన్న వీరిని చూసి యాత్రికులు హడలిపోయారు. కొద్దిసేపటికి భద్రతాసిబ్బంది అక్కడికి చేరుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆధిపత్యం కోసమే వీరి మధ్య ఘర్షణ జరిగిందని, పాత వైరంతో దాడులు చేసుకున్నారని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు వర్గాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.