Share News

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:18 AM

ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన విషాద ఘటన ఇది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే..

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

  • అత్త, కోడలు, ఆడపడుచు అనుమానాస్పద మృతి

  • భార్యపై అనుమానంతో భర్త వేధింపులు

  • పోలీసులకు ఫిర్యాదిచ్చారని తల్ల్లి, సోదరినీ వదలని వైనం

  • అల్లుడే చంపేశాడని కోడలి కుటుంబసభ్యుల ఆరోపణ

  • కృష్ణా జిల్లాలో యూట్యూబర్‌ ఇంట ఘోరం

మచిలీపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన విషాద ఘటన ఇది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వీరు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పొట్టేలుగుంట గ్రామంలో శనివారం ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేలుగుంటకు చెందిన అనుమకొండ దేవచంద్రరాజుకు ముదినేపల్లి మండలం నరసన్నపాలేనికి చెందిన మధుబాల (34)తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదేళ్లుగా భార్యపై అనుమానంతో దేవచంద్రరాజు ఆమెను వేధిస్తున్నాడు. పుట్టింటికి పంపడంతో పాటు విడాకుల నోటీసులు పంపాడు. ఇటీవల భార్యను మరింతగా వేధిస్తుండటంతో మధుబాల అత్త రజనీకుమారి (60), ఆడపడుచు తోట గౌరీదేవి(దేవచంద్రరాజు తల్లి, సోదరి) గత నెల 28న గూడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడ్ని పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తనపై కేసుపెట్టారనే కారణంతో దేవచంద్రరాజు భార్య, తల్లి, సోదరిని మరింతగా వేధించాడు. 2-3 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మహిళలు శనివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. యూట్యూబర్‌గా ఉన్న దేవచంద్రరాజు వ్యసనాలకు బానిసయ్యాడని, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని బంధువులు చెబుతున్నారు. కాగా, ముగ్గురు మహిళలకు విషమిచ్చి చంపేసి, ఉరేసుకుని మరణించినట్లుగా చిత్రీకరించాడని మధుబాల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 05:21 AM