Share News

గోదావరిలో ముగ్గురు గల్లంతు

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:55 AM

వేసవి తాపం తీర్చుకునేందుకు గోదావరిలో స్నానానికి దిగిన నలుగురిలో ప్రమాదవశాత్తు ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

 గోదావరిలో ముగ్గురు గల్లంతు

  • స్నానానికి దిగిన నలుగురు స్నేహితులు.. ఒకరి మృతదేహం లభ్యం

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వేసవి తాపం తీర్చుకునేందుకు గోదావరిలో స్నానానికి దిగిన నలుగురిలో ప్రమాదవశాత్తు ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తుమ్మలోవకు చెందిన షేక్‌ బిలాల్‌(29), మహ్మద్‌ ఆల్పాద్‌(18), గోరక్షణ పేటకు చెందిన షేక్‌ సుల్తాన్‌అహ్మద్‌(22), క్వారీ మార్కెట్‌కు చెందిన ముసల మణికంఠ స్నేహితులు. బిలాల్‌ బిర్యానీ షాపు నిర్వహిస్తుండగా మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు. శనివారం బిర్యానీ షాపునకు సెలవు కావడంతో స్నేహితులంతా మధ్యాహ్నం 3 గంటల సమయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక తాశాలమ్మ గుడి సమీపంలోని కాటన్‌ బ్యారేజీ దిగువున స్నానం చేస్తుండగా ఆల్పాద్‌, బిలాల్‌, ఆహ్మద్‌ గల్లంతయ్యారు. మణికంఠ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు గోదావరిలో దిగి గల్లంతైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎస్‌.రాము సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యల్లో షేక్‌ బిలాల్‌ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు(4, 3), ఒక కుమారుడు(1) ఉన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 04:56 AM