Share News

ధాన్యం కొనలేదని..దూలానికి ఉరివేసుకుని..

ABN , Publish Date - May 21 , 2026 | 03:56 AM

అప్పులు చేసి.. ఆరుగాలం కష్టపడి వరిసాగు చేశా డు.. కోతలు పూర్తవగానే ధాన్యా న్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు.. 20 రోజులుగా పడిగాపులే..

ధాన్యం కొనలేదని..దూలానికి ఉరివేసుకుని..

  • మెదక్‌ జిల్లాలో రైతు గాయంతి రాజయ్య ఆత్మహత్య

  • 20 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు

  • మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిళ్లు

  • తట్టుకోలేక ఆందోళనలో బలవన్మరణం

  • అప్పుల బాధతో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

చిన్నశంకరంపేట/జగదేవ్‌పూర్‌/వికారాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): అప్పులు చేసి.. ఆరుగాలం కష్టపడి వరిసాగు చేశా డు.. కోతలు పూర్తవగానే ధాన్యా న్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు.. 20 రోజులుగా పడిగాపులే.. మరోవైపు అప్పులు ఇచ్చినవారి ఒత్తిళ్లు.. తట్టుకోలేకపోయాడు.. ఏం చేయాలో తోచని ఆందోళనలో ఉరి వేసుకున్నాడు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మం డలం గవ్వలపల్లి పరిధిలోని అగ్రహారంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్రహారానికి చెం దిన గాయంతి రాజయ్య (45) చేతిలో సొమ్ము లేకపోవడంతో అప్పులు చేసి, మూడెకరాల్లో వరిసాగు చేశా రు. 20 రోజుల క్రితం పంటను అంబాజీపేట కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. ధాన్యం డబ్బులు రాగానే అప్పులు తీర్చేయాలని భావించారు. రోజూ కేంద్రానికి వచ్చి ఈ రోజైనా తన ధాన్యం కొనుగోలు చేస్తారేమోనని పడిగాపులు కాసేవారు. కానీ కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నారు. రాజయ్యకు భార్య లక్ష్మి, కుమారుడు శ్రవణ్‌ ఉన్నారు. లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

అప్పుల బాధతో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల కారణంగా మరో ఇద్దరు రైతులు బుధవారం బలవన్మరణాలకు పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం వట్టిపల్లికి చెందిన బోనకల్లూరి వెంకటేశ్‌ (30) కొన్నేళ్లుగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. దిగుబడి సరిగా లేక అప్పుల పాలయ్యారు. కొన్ని నెలల కింద చేపట్టిన ఇంటి నిర్మాణంకూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనితో మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నారు. ఇక భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వికారాబాద్‌ పరిధిలోని ఆలంపల్లికి చెందిన డాకి వెంకటేశం (33) వ్యవసాయం చేసేవారు. అప్పుల బాధ తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు.

Updated Date - May 21 , 2026 | 03:56 AM