Share News

భార్య మృతిని తట్టుకోలేక..కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య

ABN , Publish Date - May 23 , 2026 | 05:08 AM

భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ అర్చకుడు.. మానసిక ఎదుగుదల లేని తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు

భార్య మృతిని తట్టుకోలేక..కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య

  • తాను పని చేసే ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

  • రెండ్రోజుల క్రితం ఘటన, మృతదేహాలు తేలడంతో వెలుగులోకి.. జనగామ జిల్లాలో విషాదం

లింగాలఘణపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ అర్చకుడు.. మానసిక ఎదుగుదల లేని తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పురోహితుడిగా తాను నిత్యం పూజలు చేసే ఆలయంలోనికోనేరులోనే దూకి రెండ్రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రీకొడుకుల మృతదేహాలు కొనేరులో తేలియాడడంతో ఈ విషాదకర ఘటన శుక్రవారం వెలుగు చూసింది. జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెంకు చెందిన వరయూరు లక్ష్మీనర్సింహాచార్యులు(54) తమ గ్రామ శివారులోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 20ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్నారు. మానసిక ఎదుగుదల లేని లక్ష్మీనర్సింహాచార్యుల కుమారుడు పవనకుమారాచార్యులు(25) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే, లక్ష్మీనర్సింహాచార్యులు భార్య శ్రీదేవి అనారోగ్యానికి గురై ఏప్రిల్‌ 16న మరణించారు. భార్య మరణించడం, కుమారుడు మానసిక ఎదుగుదల లేనివాడు కావడంతో నర్సింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య చనిపోయినప్పటి నుంచి తన జీవితం వ్యర్థమని ఎప్పటికైనా కొడుకుతో కలిసి దేవుడి సన్నిధిలోని నీటి గుండంలోనే దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్థానికులతో చెప్పేవాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఆలయ కొనేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రీకొడుకుల మృతదేహాలు శుక్రవారం కోనేరులో పైకి తేలాయి. పంచాయతీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లింగాలఘణపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, లక్ష్మీనర్సింహాచార్యులు తల్లి కూడా 15 ఏళ్ల క్రితం ఇదే నీటి గుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:08 AM