Share News

అమెరికాలో తెలుగు టెకీ దుర్మరణం

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:45 AM

అమెరికాలో ఉన్నత చదువులు చదివాడు.. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు.. కానీ.. ఆ తెలుగు టెకీ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.

అమెరికాలో తెలుగు టెకీ దుర్మరణం

  • విమాన ప్రమాదంలో కర్నూలు వాసి సజీవ దహనం

కోసిగి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత చదువులు చదివాడు.. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు.. కానీ.. ఆ తెలుగు టెకీ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి. అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుమ్మిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సాయికార్తీక్‌ వర్మ (26) దుర్మరణం పాలయ్యాడు. కార్తీక్‌వర్మ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు దాట్ల సుబ్రహ్మణ్యంరాజు, పద్మావతి కర్నూలు జిల్లా తుమ్మిగనూరుకు వచ్చి స్థిరపడ్డారు. సుబ్రహ్మణ్యంరాజు స్థానికంగా తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ దంపతుల ఏకైక కుమారుడు కార్తీక్‌వర్మ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ మిస్సోరీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఇటీవలే కాన్సాస్‌ రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో మిస్సోరిలోని బట్లర్‌ మెమోరియల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. స్కై డైవింగ్‌ చేసేందుకు 11 మంది స్కై డైవర్లతో బయల్దేరిన సింగిల్‌ ఇంజిన్‌ ప్రైవేటు విమానం (పసిఫిక్‌ ఏరోస్పేస్‌ పీ750) బట్లర్‌ మెమోరియల్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. విమానం నేలను తాకగానే మంటలు చెలరేగడంతో పైలట్‌ సహా 12 మంది సజీవ దహనమయ్యారు. వీకెండ్‌ కావడంతో సరదాగా స్కై డైవింగ్‌ చేసేందుకు వెళ్లిన సాయి కార్తీక్‌ వర్మ కూడా ఈ ప్రమాదంతో దుర్మరణం పాలైనట్టు అమెరికా అధికారులు సోమవారం రాత్రి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో కార్తీక్‌ వర్మ మృతదేహం పూర్తిగా కాలి బూడిదైనట్లు ఆయన తండ్రి సుబ్రహ్మణ్యంరాజు తెలిపారు. డీఎన్‌ఏ రిపోర్టు ద్వారా మృతులను గుర్తించే అవకాశం ఉందని చెప్పారు.

Updated Date - Jun 17 , 2026 | 04:45 AM