చీరతో కట్టేసి.. కత్తితో మెడ కోసి..!
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:04 AM
వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో భర్త చేతులను చీరతో కట్టేసిన భార్య.. కత్తితో తల, మెడపై దాడిచేసి దారుణంగా హత్య చేసింది.
భర్తను దారుణంగా హత్య చేసిన భార్య .. వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నాడని ఘాతుకం
మహబూబ్‌నగర్ జిల్లా బస్వాయిపల్లిలో ఘటన
మద్యం మత్తులో గొడవతో భార్యను చంపి ఆత్మహత్య
అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో దారుణ ఘటనలు
దేవరకద్ర, మల్యాల, కాటారం, జూన్ 29 (ఆంద్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో భర్త చేతులను చీరతో కట్టేసిన భార్య.. కత్తితో తల, మెడపై దాడిచేసి దారుణంగా హత్య చేసింది. మరో ఘటనలో మద్యం మత్తులో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకోగా, ఇంకో ఘటనలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. మహబుబ్‌నగర్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఈ దారుణాలు జరిగాయి. మహబుబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన కొమ్మూరు నాగేష్ (38)కు 17 ఏళ్ల క్రితం కోయిల్‌కొండ మండలం మల్కాపూర్‌కు చెందిన కవితతో వివాహం జరిగింది. కవిత రెండేళ్ల నుంచి మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తుండటంతో భర్త నాగేష్ మందలించాడు. ఆదివారం ఇదే విషయమై వారిద్దరికీ గొడవ జరిగింది. అదే రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నాగేష్ రెండు చేతులను చీరతో కట్టేసిన భార్య.. కత్తితో తల, మెడపై దారుణంగా దాడి చేసిం ది. దీంతో ఆయన రక్తపుమడుగులో పడిపోయాడు. నాగేష్ సోదరుడు వెంటనే జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి నాగేష్‌ను తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నాగేష్ మృతి చెందాడు.
మద్యానికి బానిసై..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లికి చెందిన ఓలపు నాగరాజు (45), అదే గ్రామానికి చెందిన లక్ష్మి (40) 24 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సంతానం కలగకపోవడంతో నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. మూడేళ్ల క్రితం ఓ బాలుడిని దత్తత తీసుకోగా కొన్నాళ్లు మద్యం మానేశాడు. ఇటీవల మళ్లీ మద్యం సేవిస్తుండడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గొడవ జరగ్గా మద్యం మత్తులో నాగరాజు గడ్డి మందు తాగడానికి యత్నించగా భార్య అడ్డుకుంది. అనంతరం మళ్లీ గొడవ జరగ్గా కోపంతో నాగరాజు.. భార్య మెడకు టవల్ చుట్టి గొంతు నులుమడంతో మృతి చెందింది. అనంతరం నాగరాజు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అర్థరాత్రి గొడ్డలితో నరికి..
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచకు చెందిన రజితతో భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లికి చెందిన మంథెన సత్యం అలియాస్ సతీ్‌షకు 14ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల సత్యం.. భార్య పై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అర్ధరాత్రి నిద్ర లేచిన సత్యం.. భార్య రజితను గొడ్డలితో నరికి పారిపోయాడు.
