Share News

నిర్లక్ష్యానికి బలైన తల్లీబిడ్డ

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:34 AM

ఓ వైపు ఆశావర్కర్‌ నిర్లక్ష్యం.. మరోవైపు ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా బాలింత, నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయారు.

నిర్లక్ష్యానికి బలైన తల్లీబిడ్డ

  • వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన నర్సు

  • పురిట్లోనే ఆడశిశువు మృతి.. రక్తస్రావంతో తల్లి కన్నుమూత

  • భద్రాద్రి జిల్లాలో ఘటన

గుండాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు ఆశావర్కర్‌ నిర్లక్ష్యం.. మరోవైపు ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా బాలింత, నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగింది. బాధిత కుటుంబం జిల్లా వైద్యాధికారికి మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంభూనిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ(20)కు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆశావర్కర్‌కు సమాచారం అందించారు. అయితే, ఆశా వర్కర్‌ తన సొంత పనులన్నీ చక్కబెట్టుకుని మధ్యాహ్నానికి వచ్చి గర్భిణిని గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. తీరా ఆస్పత్రికి వెళ్లే సరికి అక్కడ వైద్యులు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న నర్సు వనజకు సాధారణ కాన్పు చేసింది. ఈ క్రమంలో ఆడబిడ్డ జన్మించినా, ఆ శిశువు పురిట్లోనే మరణించింది. శిశువు అపస్మారక స్థితిలో ఉందని భావించిన నర్సు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి పంపగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, కాన్పు తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం కన్ను మూసింది.ఆస్పత్రి నిర్లక్ష్యంతో తమకు తీరని అన్యాయం జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 17 , 2026 | 04:34 AM