Share News

మళ్లీ ఆడపిల్లేనని..!

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:43 AM

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. భార్య గర్భంలో ఉన్న పిండం కూడా ఆడపిల్లేనని అనుమానం.. అబార్షన్‌ చేయించుకోమంటే భార్య ఒప్పుకోవడం లేదని కోపం..

మళ్లీ ఆడపిల్లేనని..!

  • మళ్లీ ఆడపిల్లేనని..!భార్య ప్రస్తుతం మూడు నెలల గర్భిణి

  • ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం

  • హనుమకొండ జిల్లా పున్నేలులో దారుణం

ఐనవోలు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు.. భార్య గర్భంలో ఉన్న పిండం కూడా ఆడపిల్లేనని అనుమానం.. అబార్షన్‌ చేయించుకోమంటే భార్య ఒప్పుకోవడం లేదని కోపం.. అంతే ఓ వ్యక్తి తాను మనిషిననే సంగతి కూడా మరిచిపోయాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను, తమ ఇద్దరు కుమార్తెలను పథకం ప్రకారం చంపేశాడు. సరదాగా గడుపుదామని భార్యాబిడ్డలను స్విమ్మింగ్‌ పూల్‌కు తీసుకెళ్లి నీళ్లల్లో ముంచి చంపేశాడు. నాన్న అమ్మను చంపుతుంటే చూసి.. ‘‘మమ్మీ.. మమ్మీ’’ అని ఏడుస్తూ కన్నబిడ్డలు దగ్గరికి రాగా.. ఏమాత్రం కనికరం లేకుండా నీటిలో ముంచి ఆ చిన్నారుల ఉసురు కూడా తీసేశాడు. ఆపై, తన భార్యాబిడ్డలు ప్రమాదవసాత్తు మరణించారని నాటకమాడినా.. పోలీసు విచారణలో దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో బుధవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పర్వతగిరి సీఐ రాజగోపాల్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పున్నేలుకు చెందిన అజారుద్దీన్‌, ఫరాహత్‌(26) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉమేరా(8), ఆయేషా(7) అనే కుమార్తెలు ఉన్నారు. ఉమేరా రెండో తరగతి, ఆయేషా యూకేజీ చదువుతున్నారు. ఆడపిల్లలంటే ఇష్టం లేని అజారుద్దీన్‌కు ఓ కుమారుడు కావాలనే కోరిక విపరీతంగా ఉంది. ఫరాహత్‌ మూడు నెలల క్రితం గర్భం దాల్చగా.. లింగనిర్ధారణ పరీక్షలో పుట్టబోయేది అమ్మాయేనని తేలింది. దీంతో అబార్షన్‌ చేయించుకోవాలని ఫరాహత్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇలా అజారుద్దీన్‌ ఒత్తిడితో గతంలో రెండుసార్లు అబార్షన్‌ చేయించుకున్న ఫరాహత్‌ ఈసారి ససేమిరా అంది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగ్గా.. ఫరాహత్‌ పిల్లలిద్దరినీ తీసుకొని అదే గ్రామంలోని తన పుట్టింటికి పది రోజుల క్రితం వెళ్లిపోయింది. పెద్ద మనుషులను తీసుకెళ్లి బతిమిలాడిన అజారుద్దీన్‌.. భార్యాబిడ్డలను మూడు రోజుల క్రితమే ఇంటికి తెచ్చుకున్నాడు.


ఐస్‌క్రీమ్‌ తిందామని తీసుకెళ్లి..

భార్యపై కోపం పెంచుకున్న అజారుద్దీన్‌ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఐస్‌క్రీమ్‌ తిందామని చెప్పి భార్య, ఇద్దరు కుమార్తెలను బుధవారం రాత్రి 8 గంటలకు గ్రామశివారులోని తమ సొంత స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి బిర్యానీ, ఐస్‌క్రీమ్‌లు తిన్నా రు. అప్పటికే స్విమ్మింగ్‌ పూల్‌ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్‌ దీపాలను అజారుద్దీన్‌ ఆపేశాడు. తొలుత ఫరాహత్‌ను స్విమింగ్‌ పూల్‌లోకి దించి ఆమెను నీటిలో ముంచే యత్నం చేశాడు. ఫరాహత్‌ ప్రతిఘటించినా ఊపిరాడక చనిపోయింది. తల్లిని చంపుతుండగా స్విమ్మింగ్‌ పూల్‌ బయట నుంచి చూసిన కూతుళ్లు ఉమేరా, ఆయేషా ‘మమ్మీ.. మమ్మీ’ అంటూ అరుస్తూ దగ్గరికి వెళ్లారు. కన్నబిడ్డలనే కనికరం కూడా లేని అజారుద్దీన్‌.. పిల్లలిద్దరనీ స్విమ్మింగ్‌ పూల్‌లోకి లాగి నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. భార్యాబిడ్డల మరణాన్ని నిర్ధారించుకున్న అజారుద్దీన్‌.. తన తండ్రి, సోదరుడికి ఫోన్‌ చేశాడు. బాత్రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి తన భార్యాబిడ్డలు నీళ్లలో మునిగిపోయారంటూ నాటకమాడాడు. స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు వచ్చిన అజారుద్దీన్‌ తండ్రి, సోదరు డు.. ఫరాహత్‌, ఉమేరా, ఆయేషాలను బయటకు తీసి వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురూ అప్పటికే మరణించారని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, పోలీసు విచారణలో అజారుద్దీన్‌ తాను చేసిన ఘోరాన్ని బయటపెట్టాడు. భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు భార్య కడుపులో ఉన్న మూడు మాసాల పిండం చనిపోవడంతో నలుగురి ప్రాణాలు తీసినట్లు అజారుద్దీన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 04:43 AM