Share News

మరో వ్యక్తితో చనువుగా ఉండొద్దన్నందుకు..

ABN , Publish Date - May 21 , 2026 | 03:14 AM

మరో వ్యక్తితో అంత చనువుగా ఉండటం ఏమిటి? అంటూ తనకు భర్త మందలించినందుకు ఆ భార్య గొడవపెట్టుకుంది. ఇద్దరి మద్య వాగ్వాదం పెరగడంతో ఆ భార్య చెరుకు నరికే కత్తితో భర్తపై దాడి చేసింది.

మరో వ్యక్తితో చనువుగా ఉండొద్దన్నందుకు..

  • కత్తితో భర్తపై భార్య దాడి.. తీవ్రగాయాలు.. ఆ వ్యక్తితో కలిసే దాడి చేసి ఉంటుందా?

  • ఆమెతో పాటు అతడూ పరారీలో

  • ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

  • పిల్లలను చూసి వెళ్తానని కోరినందుకు భర్తను కొట్టించిన భార్య.. బాధితుడి మృతి

  • వనస్థలిపురంలో ఘటన.. అదుపులో నిందితులు

కూసుమంచి, వనస్థలిపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): మరో వ్యక్తితో అంత చనువుగా ఉండటం ఏమిటి? అంటూ తనకు భర్త మందలించినందుకు ఆ భార్య గొడవపెట్టుకుంది. ఇద్దరి మద్య వాగ్వాదం పెరగడంతో ఆ భార్య చెరుకు నరికే కత్తితో భర్తపై దాడి చేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడుతండాలో ఈ ఘటన వెలుగుచూసింది. దాడి చేశాక.. బాధితుడు రాత్రంతా నిస్సహాయ స్థితిలో గడిపితే ఉదయం ఇతక కుటుంబసభ్యులు వచ్చి చూసి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తండాకు చెందిన బాణోతు వీరన్న(45), రుక్కమ్మ భార్యాభర్తలు. మునిగేపల్లి గ్రామానికి చెందిన రాంబాబుతో వీరన్నకు పరిచయం ఉండటంతో రాంబాబు తరచూ వీరన్న ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈక్రమంలో రాంబాబు, రుక్కమ్మతో చనువుగా గడుపుతుండటాన్ని గమనించిన వీరన్న.. రుక్కమ్మను మందలించాడు. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. అది ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఘర్షణ సమయంలో రుక్కమ్మ.. ఇంట్లో ఉన్న చెరుకు నరికే కత్తిని తీసుకొని వీరన్నపై దాడిచేసింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం ఉదయం బయటనుంచి వచ్చిన కుటుంబసభ్యులు, అపస్మారకస్థితిలో ఉన్న వీరన్నను గమనించి చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం రుక్కమ్మ, రాంబాబు కనిపించకుండా పోయారు. దీంతో రాంబాబుతో కలిసే రుక్కమ్మ ఈ దాడికి పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరన్న కుమారుడు వాసునాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


రుక్కమ్మ, రాంబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టామని కూసుమంచి ఎస్సై తెలిపారు. మరో ఘటనలో.. భార్యతో గొడవ జరిగి నాలుగేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్న భర్త.. పిల్లలను కళ్లారా చూసి వెళ్తానని కోరినందుకు అతడిపై ఆమె దాడి చేయించింది. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వనస్థలిపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతుడు వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన గురు వెంకటేశ్‌ (31). హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా అక్కడ పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌కు చెందిన దుబ్బల స్వప్న (28)తో అతడికి పరిచయం ఏర్పడింది. 2015లో వెంకటేశ్‌, స్వప్న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. స్వప్న వనస్థలిపురంలోని ఓ భవనంలోని ఏడో అంతస్తులో పిల్లలతో కలిసి ఉంటోంది. వెంకటేశ్‌, మరోచోట తన స్నేహితుల గదిలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 12 గంటలకు వెంకటేశ్‌ వనస్థలిపురంలోని స్వప్న ఇంటికి వెళ్లాడు. తలుపుతీసిన భార్యను ఉద్దేశించి పిల్లలను ఒకసారి చూసి వెళ్తానని కోరాడు. అయితే స్వప్న సోదరుడు పాండు, అతడి స్నేహితుడు జగదీశ్‌.. కడుపులో పిడిగుద్దులు కురిపించడంతో వెంకటేశ్‌ అక్కడికక్కడే కుప్పకూలాడు. అతడిని ఏడో అంతస్తు నుంచి మెట్ల మార్గం గుండా కిందకు తీసుకొస్తుండగా.. ఆవైపు వచ్చిన ఓ వ్యక్తి తన ఫోన్‌తో వీడియో తీశాడు. భయపడిపోయిన ఆ ఇద్దరు, వెంకటేశ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం చూసేసరికి వెంకటేశ్‌ చనిపోయి ఉండటంతో సమాచారం అందుకొని పోలీసులొచ్చారు. స్థానికులను విచారించి నిందితులు స్వప్న, పాండును అరెస్టట చేశారు. జగదీశ్‌ పరారీలో ఉన్నాడు.

Updated Date - May 21 , 2026 | 03:14 AM