రియల్ వ్యాపారిని హత్య చేసిన కానిస్టేబుల్
ABN , Publish Date - May 07 , 2026 | 05:45 AM
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా అప్పులు చేసిన ఓ కానిస్టేబుల్ వాటిని తీర్చేందుకు హత్య, చోరీలకు పాల్పడ్డాడు. తన భార్యతో కలిసి ఓ వృద్ధురాలి దగ్గరున్న బంగారాన్ని చోరీ చేయడమే కాకుండా..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా అప్పులు
అవి తీర్చేందుకు హత్య, చోరీ.. సహకరించిన భార్య
సిద్దిపేట క్రైం, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా అప్పులు చేసిన ఓ కానిస్టేబుల్ వాటిని తీర్చేందుకు హత్య, చోరీలకు పాల్పడ్డాడు. తన భార్యతో కలిసి ఓ వృద్ధురాలి దగ్గరున్న బంగారాన్ని చోరీ చేయడమే కాకుండా, ఒంటిపై ధరించిన బంగారం కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా క్రైం విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గౌటే ప్రవీణ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ. 36 లక్షల వరకు నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు హత్యలు, చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన సోదరుడి ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బెలిదే విశ్వనాథ్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. విశ్వనాథ్ ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన ప్రవీణ్‌కుమార్.. భార్య రజితతో కలిసి విశ్వనాథ్‌ను చంపాలని పథకం వేశాడు. వారిద్దరూ ఈ నెల 2న ప్లాట్ చూపిస్తామని చెప్పి విశ్వనాథ్‌ను కారులో పెద్దకోడూరు శివారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. విశ్వనాథ్ చేతులు కట్టేసి, మెడకు వైర్ బిగించి దారుణంగా చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చేతి కడియం, ఐదు ఉంగరాలను తీసుకుని మృతదేహాన్ని రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ మల్లన్నసాగర్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. అంతకు ముందు గత నెల 25న వారి పక్కింట్లో ఉండే వృద్ధురాలు బొడ్డు నరసవ్వను ఆస్పత్రి పేరుతో కారులో తీసుకెళ్లి ఆమెకు తెలియకుండా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 3.5 తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించారు. బంగారాన్ని హైదరాబాద్‌లోని దుకాణాల్లో విక్రయించి సుమారు 16 లక్షలు తీసుకున్నారు. విశ్వనాథ్ భార్య వనిత ఫిర్యాదు మేరకు ఆయన కనిపించకుండా పోయిన ఈ నెల 2న మిస్సింగ్ కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు.. ఈనెల 3న మల్లన్నసాగర్‌లో విశ్వనాథ్ మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, సాంకేతిక ఆధారాలతో నిందితులైన కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్, అతని భార్య రజితలను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు.