Share News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై రాష్ట్రాల్లో సీఐడీ దాడులు.. 11మంది అరెస్ట్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:05 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణలో భాగంగా.. దేశవ్యాప్తంగా బెట్టింగ్‌ ముఠాలపై దాడులు నిర్వహించినట్లు సీఐడీ డీజీపీ చారుసిన్హా వెల్లడించారు..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై రాష్ట్రాల్లో సీఐడీ దాడులు.. 11మంది అరెస్ట్‌

  • ప్రచారం చేసే సెలబ్రిటీలపై చర్యలు : సీఐడీ డీజీ చారుసిన్హా

  • ఈ-ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్‌.. మైనింగ్‌ అక్రమాలపై విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణలో భాగంగా.. దేశవ్యాప్తంగా బెట్టింగ్‌ ముఠాలపై దాడులు నిర్వహించినట్లు సీఐడీ డీజీపీ చారుసిన్హా వెల్లడించారు.. కరీంనగర్‌లో నమోదైన డాఫా బెట్‌ కేసులో పలువురిని అరెస్ట్‌ చేశామని సోమవారం సీఐడీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. 46 మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేశామని, ఈ కేసులో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా నిర్వాహకులు రోజుకు రూ. 8 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారని వివరించారు. 40మంది అధికారులు ఈ కేసు విచారణలో పాల్గొన్నారని, 15 రోజుల పాన్‌ ఇండియా స్థాయి ప్రత్యేక ఆపరేషన్‌లో ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌లలో 11 మందిని అరెస్ట్‌ చేశామని చారుసిన్హా తెలిపారు. ఇదంతా ఇంటర్నేషనల్‌ బెట్టింగ్‌ దందాగా భావిస్తున్నామన్నారు. ఈ డాఫా బెట్‌పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు 73 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశామని, 108 అప్లికేషన్లను గుర్తించి వీటిపై చర్యలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని ఆమె వివరించారు. 37 బెట్టింగ్‌ అప్లికేషన్లు మూసి వేయించామని, తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉండేలా జియో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. బెట్టింగ్‌ ప్రమోట్‌ చేస్తున్న 25 మంది సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ప్రముఖులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చామని, మరోసారి ఇలా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. మరోవైపు హెచ్సీఏ అక్రమాలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఫార్ములా కేసులో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశామని, ఫార్ములా కేసులో త్వరలోనే ట్రయల్‌ కొనసాగుతుందని ఆమె తెలిపారు. మైనింగ్‌ అక్రమాలపై త్వరలో విచారణ చేపడుతామని, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 05:05 AM