Share News

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:56 AM

యువకుడి మోజులో పడిన బాలిక, అతడితో తన సంబంధానికి కన్నతల్లి అడ్డుగా ఉందని భావించి ఆమెను ప్రియుడితో కలిసి హత్యచేసింది.

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

  • ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చివేత.. పై నుంచి కాంక్రీటు

  • చెడు తిరుగుళ్లు వద్దని మందలించినందుకే ఘాతుకం

  • ఆ ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొన్నాళ్లు సహజీవనం

  • గత జనవరిలో అతడితోనే వివాహం

  • హైదరాబాద్‌లో ఘటన

  • ఏడాది తర్వాత వెలుగులోకి

బిట్స్‌ పిలానీ/హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): యువకుడి మోజులో పడిన బాలిక, అతడితో తన సంబంధానికి కన్నతల్లి అడ్డుగా ఉందని భావించి ఆమెను ప్రియుడితో కలిసి హత్యచేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఘటన జరిగిన ఏడాదికి ఈ హత్యోదంతం వెలుగుచూసింది. జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. మల్కాజిగిరి కమిషనరేట్‌లో డీసీపీ శ్రీధర్‌ కేసు వివరాలను వెల్లడించారు. కౌకూర్‌ భరత్‌నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమెను భర్త వదిలేశాడు. పెద్దమ్మాయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని ఇంటికి దూరంగా ఉంటోంది. చిన్న కుమార్తె (17) ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. 2024లో ఆ చిన్న కుమార్తె బిహార్‌కు చెందిన మోంటీ సింగ్‌ (22) అనే డ్రైవర్‌తో ప్రేమలో పడింది. తల్లి పనులకు వెళ్లగానే ఆ బాలిక, మోంటీని ఇంటికి పిలిపించుకునేది. ఆ ఏడాది అక్టోబరులో బాలిక ఇంట్లో మోంటీతో ఏకాంతంగా ఉండగా తల్లి చూసింది. కుమార్తెను మందలించింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోంటీపై పోక్సో కేసు నమోదు చేశారు. యాభై రోజులు జైల్లో ఉండి, బయటకొచ్చాక కూడా మోంటీ ఆ బాలికతో సంబంధం కొనసాగించాడు. దీనిపై బాలిక తల్లి మరోసారి గత ఏడాది జనవరిలో బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు మోంటీని మరోసారి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అతడు బయటకొచ్చిన కొన్నాళ్లకు బాలిక మోంటీతో కలిసి ఓ పథకం వేసింది.


తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తల్లిని హత్య చేయాలని నిర్ణయించింది. గత ఏడాది మే నెల 10న బాలిక తల్లి పనులకు వెళ్లగానే మోంటీ ఇంట్లోకి ప్రవేశించి లోపల దాక్కున్నాడు. సాయంత్రం బాలిక తల్లి తిరిగొచ్చింది. కొద్దిసేపటికి ఆమెను బాలిక వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా ప్రియుడు కత్తితో పలుమార్లు కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో బాలిక తల్లి అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని ఇద్దరూ దుప్పట్లో చుట్టి, మంచం కింద దాచారు. నేలమీద పడ్డ రక్తపు మరకలను శుభ్రం చేశారు. ఇంట్లో ఎలుకలు, పందికొక్కుల బొయ్యారాలను పూడ్చుతున్నామని స్థానికులకు చెబుతూ ఇంటి ఆవరణలోనే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. దానిపై కాంక్రీట్‌ వేశారు. తర్వాత తల్లి కనిపించడం లేదంటూ బాలిక తన అక్కకు చెప్పింది. మగతోడు లేని తన తల్లి ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందని భావించిన ఆ పెద్ద కూతురు.. ఐదునెలల తర్వాత అంటే గత ఏడాది అక్టోబరులో ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తల్లిని పూడ్చిపెట్టిన ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొంతకాలం నివసించిన బాలిక ఈ ఏడాది జనవరి 8న యాదగిరిగుట్టలో తన ప్రియుడు మోంటీని పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ మరోచోటుకు మకాం మార్చారు. ప్రస్తుతం ఆ బాలికకు రెండు నెలల బాబు ఉన్నాడు. ఇటీవల మోంటీ, హతురాలి పేరుమీద ఉన్న స్కూటీ అమ్మే ప్రయత్నం చేశాడు. అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. హత్య విషయం వెలుగులొకొచ్చింది. మోంటీని, ఆ బాలికను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిక తల్లి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Mar 26 , 2026 | 04:56 AM