గురువులు కాదు కీచకులు
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:58 AM
పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు.
విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి దుశ్చర్య
వీడియో తీసినమరో ఉపాధ్యాయుడు
దానిని వైరల్ చేసిన గ్రామ సర్పంచ్ భర్త, అతని అనుచరులు
ఉపాధ్యాయులు, హెచ్‌ఎం, మరో నలుగురిపై పోక్సో కేసు
నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
మద్దూర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు. ఆ బాలిక పాలిట కీచకులుగా మారారు. పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకొని ఓ ఉపాధ్యాయుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అత్యంత దారుణమైతే.. ఆ ఉపాధ్యాయుడితో విభేదాలు కలిగిన మరో టీచరు.. సదరు ఉపాధ్యాయుడు, బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు గుట్టుగా వీడియో తీసి ఆ గ్రామ సర్పంచ్ భర్తకు పంపాడు. ఆ సర్పంచ్ భర్త, అతని అనుచరులు కలిసి బెదిరింపులకు దిగి.. చివరికి ఆ వీడియోను వైరల్ చేసి మరింత ఘోరానికి తెగబడ్డారు.
నారాయణపేట జిల్లా, మద్దూరు మండలంలోని మోమినాపూర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, స్థానిక ప్రజాప్రతినిధి భర్త, అతడి అనుచరులు ముగ్గురు మొత్తం ఏడుగురిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దాని ప్రకారం.. మోమినాపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చండేపల్లి స్వామి.. ఓ పదో తరగతి విద్యార్థినితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. అతడితో విబేధాలున్న గురునాథ్ రెడ్డి అనే మరో ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలిసింది. అయితే, గురునాథ్ రెడ్డి పాఠశాల కంప్యూటర్ గదిలో రహస్యంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఇటీవల స్వామి, ఆ విద్యార్థినితో కంప్యూటర్ గదిలో అసభ్యంగా ప్రవర్తించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గురునాథ్ రెడ్డి ఆ వీడియోను స్థానిక సర్పంచ్ భర్త గూళ్ల రవికి షేర్ చేశాడు. రవి తన అనుచరులైన ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవికి విషయం చెప్పాడు. వీళ్లు సదరు వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని స్వామి, గురునాథ్ రెడ్డితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులను బెదిరించారు. కానీ, ఒప్పందం బెడిసికొట్టడంతో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వగా మార్చి 26న విషయం బయటికొచ్చింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అలాగే, ఈ ఘటనపై డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు స్వామి ఆ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో స్వామితోపాటు రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసి వీడియో తీసిన గురునాథ్ రెడ్డి, విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు, వీడియోలను షేర్ చేసుకొని, డబ్బు డిమాండ్ చేసి రాజీ కుదుర్చేందుకు యత్నించిన గూళ్ల రవి, బి. ఆనంద్, విజయ్‌కుమార్, మేకల రవిపై పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ కేసులు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ కెమెరా, నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.