ఇద్దరు బాలురు, బాలికపై అత్యాచారం కేసులో పూజారికి 178 ఏళ్ల జైలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:46 AM
ఇద్దరు బాలురతో పాటు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పూజారికి 178 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
చెన్నై, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు బాలురతో పాటు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పూజారికి 178 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లా చోళపురం ప్రాంతానికి చెందిన పెరియస్వామి (70) ఆ ప్రాంతంలోని ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. 2024 సెప్టెంబరు 13వ తేదీన ఆలయానికి వచ్చిన 9, 10 ఏళ్ల బాలురు, 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన స్నేహితురాలి ద్వారా ఉపాధ్యాయులకు తెలియజేసింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు.. పెరియస్వామి అత్యాచారానికి పాల్పడినట్టు నిర్ధారించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివగంగ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణ శివగంగ పోక్సో ప్రత్యేక కోర్టులో జరగ్గా.. న్యాయాధికారి గోకుల మురుగన్ సోమవారం తీర్పు వెలువరించారు. ముగ్గురు చిన్నారులను గాయపరచడం, బెదిరించడం, అత్యాచారానికి పాల్పడడం వంటి ఒక్కో నేరానికి ఒక్కో సెక్షన్ కింద వేర్వేరు జైలుశిక్షలు, జరిమానా విధించారు. అలాగే, ఒక్కో శిక్ష విడివిడిగా అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఆ ప్రకారం, ఆలయ పూజారి పెరియస్వామికి మొత్తం 178 ఏళ్ల జైలుశిక్ష, రూ.8 వేలు జరిమానా విధించారు.