ఏకాంత ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు!
ABN , Publish Date - May 23 , 2026 | 05:31 AM
ఓ హోమో సెక్సువల్ (స్వలింగ సంపర్కుల) డేటింగ్ యాప్‌లో ఏర్పడిన పరిచయంతో ఆ ముగ్గురు యువకుల మధ్య స్నేహం మొదలైంది.
స్నేహితుడిని దారుణంగా చంపిన ఇద్దరు యువకులు..
ఓ హోమో సెక్సువల్ డేటింగ్ యాప్‌లో వారి పరిచయం
కోదాడ రూరల్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఓ హోమో సెక్సువల్ (స్వలింగ సంపర్కుల) డేటింగ్ యాప్‌లో ఏర్పడిన పరిచయంతో ఆ ముగ్గురు యువకుల మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత కలిసి తిరిగారు.. విందులు, వినోదాలు చేసుకున్నారు. చివరికి వారి మధ్య మనస్పర్థలు తలెత్తగా.. ఓ వ్యక్తి ఏకాంతంగా గడిపినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో మిగతా ఇద్దరు అతడి ప్రాణాలు తీశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేశ్ (25) బెంగళూరులో ఓ హోటల్‌లో ఉద్యోగం చేసేవాడు. వంట గ్యాస్ సంక్షోభం కారణంగా హోటల్‌ను మూసేయడంతో స్వగ్రామానికి తిరిగొచ్చాడు. మేళ్లచెర్వులో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే హుజూర్‌నగర్‌కు చెందిన బర్రెంకుల సోమేశ్, హుజూర్‌నగర్‌లోని ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేసే కొత్తగూడెం గ్రామానికి చెందిన పగిల్ల ఉదయ్‌కిరణ్‌లతో గణేశ్‌కు పోలో యాప్ ద్వారా పరిచయమై స్నేహితులుగా మారారు. వీరు తరుచూ కలిసి తిరిగేవారు. ఇటీవల సోమేశ్, గణేశ్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో తనతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని సోమేశ్‌ను గణేశ్ బెదిరించాడు. ఇటు తన మరదలిని కూడా గణేశ్ వేధిస్తున్నాడని ఉదయ్‌కిరణ్ మనసులో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమేశ్, ఉదయ్‌కిరణ్ కలిసి ఈ నెల 14న గణేశ్‌కు ఫోన్ చేసి గణపవరం శివారులోని మామిడితోట వద్దకు రమ్మన్నారు. దీంతో అక్కడికి వచ్చిన గణేశ్‌ను సోమేశ్ కిందపడేసి తలమీద బండరాయి పడవేశాడు. అనంతరం అతడిని పట్టుకొని ఇద్దరు గొంతుకోసి చంపి పరారయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో సోమేశ్, ఉదయ్‌కిరణ్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు సోమేశ్ తల్లిదండ్రులు సాంబయ్య, జ్యోతి కూడా సహకరించారని నిర్ధారించారు. ఉదయ్‌కిరణ్‌తో పాటు వారిద్దరినీ అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న సోమేశ్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.