మర్డర్ కేసులో అప్పీల్‌పై విచారణకు 41 ఏళ్లా?
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:54 AM
హత్య కేసులో కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన అప్పీలును అలహాబాద్ హైకోర్టు ఏకంగా 41 ఏళ్ల పాటు పెండింగ్‌లో..
అలహాబాద్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ, జూన్ 9: హత్య కేసులో కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన అప్పీలును అలహాబాద్ హైకోర్టు ఏకంగా 41 ఏళ్ల పాటు పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అసాధారణ జాప్యం ఆందోళనకరమని, దీనిని నివారించడానికి వినూత్న సలహాలు ఇవ్వాలని కోరింది. సోదరుడిని కాల్చి చంపాడన్న కేసులో విజయ్ సింగ్ అనే వ్యక్తిని 1983 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. కాన్పూర్‌లోని సెషన్స్ కోర్టు విచారణ జరిపి 1985 డిసెంబరులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేయగా అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. ఆయన చేసిన అప్పీలును కొట్టివేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 పేజీల తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై ఆయన మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. పరిశీలించిన ధర్మాసనం ఆయన కేవలం మూడు నెలలపాటే జైలులో ఉన్నాడని, దాదాపు 43 ఏళ్లపాటు బెయిల్‌పై బయటే ఉన్నాడని గుర్తించింది. దాంతో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు బెయిల్‌పైనే కొనసాగాలని ఆదేశించింది.