ఫలితాల వెల్లడికి కొన్ని గంటల ముందే మృత్యు ఒడికి..
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:59 AM
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి.. ఆ విషయం తెలియకుండానే, కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆ సంతోషం పంచుకోకుండానే మృత్యు ఒడికి చేరాడు.
నకిరేకల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి.. ఆ విషయం తెలియకుండానే, కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆ సంతోషం పంచుకోకుండానే మృత్యు ఒడికి చేరాడు. ఫలితాలు వెల్లడికి కొద్ది గంటలముందే ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రూరు గ్రామంలో జరిగిందీ ఘటన. మర్రూరుకు చెందిన సైదులు కుమారుడు మన్నెం జశ్వంత్ (15) నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాశాడు. బుధవారం అతడు తన ఇంటి ముందున్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా.. అప్పటికే గేర్‌లో ఉన్న ఆ వాహనం ముందుకు దూసుకువెళ్లింది. జశ్వంత్ కల్టివేటర్‌లో చిక్కుకున్నాడు. కుటుంబసభ్యులు అతణ్ని నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మధ్యాహ్నం సమయంలో విడుదలైన ఫలితాల్లో.. జశ్వంత్ ఉత్తీర్ణుడైనట్లు తెలియటంతో.. ‘‘పాసైన సంతోషం పంచుకోకుండానే మృత్యుఒడికి చేరావా’’ అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.