Share News

అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:26 AM

ఉన్నత చదువు కోసం డిగ్రీలో చేరిన ఓ విద్యార్థి.. అసాంఘిక కార్యకలాపాల్లో పట్టభద్రుడయ్యారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం మునసబుపేట వద్ద ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి..

అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్‌

  • ఏఐతో అశ్లీలంగా మార్పుచేసి ఆపై బెదిరింపులు

  • నిందితుడు బీఎస్సీ కంప్యూటర్స్‌ విద్యార్థి

  • విద్యార్థినుల ఆందోళనతో విషయం బయటకు

  • ఐదుగురికి టీసీ ఇచ్చి పంపేసిన ప్రిన్సిపాల్‌

శ్రీకాకుళం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువు కోసం డిగ్రీలో చేరిన ఓ విద్యార్థి.. అసాంఘిక కార్యకలాపాల్లో పట్టభద్రుడయ్యారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం మునసబుపేట వద్ద ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. చదువుపై కన్నా అమ్మాయిలను ఫొటోలు తీయడంపైనే శ్రద్ధ చూపాడు. ఆ ఫొటోలను ఏఐ టెక్నాలజీని వినియోగించి అశ్లీలంగా.. వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. సీనియర్‌ విద్యార్థినుల ఫొటోలు తీసి మార్ఫింగ్‌ చేసి.. అవి వారికి పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఓ విద్యార్థిని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు కళాశాలలో తెలియజేశారు. బాఽధిత విద్యార్థిని సోదరుడు ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్న విద్యార్థి వద్దకు వెళ్లి.. అతడి ఫోన్‌లో ఉన్న డేటాను తొలగించాడు. కాలేజీలో ఫిర్యాదు చేశాడు. వికృతచేష్టలకు కారణమయిన విద్యార్థిని ప్రిన్సిపాల్‌ ప్రశ్నించారు. అతడు తన తప్పు అంగీకరించి.. లేఖరాసి ఇచ్చాడు. వెంటనే ప్రిన్సిపాల్‌ టీసీ ఇచ్చి పంపేశారు. ఆ విద్యార్థి వద్ద మరికొందరి ఫొటోలు ఉన్నాయని.. ఎలా విడిచిపెడతారని తోటి విద్యార్థినులు, కుటుంబ సభ్యులు గురువారం కళాశాల వద్ద ధర్నా చేశారు. ఇంతవరకు విషయాన్ని గుట్టుగా ఉంచిన ప్రిన్సిపాల్‌.. చివరకు తాను టీసీ ఇచ్చి పంపేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆ విద్యార్థితో మరో నలుగురు విద్యార్థులు అత్యంత చనువుగా ఉన్నారని యాజమాన్యం గుర్తించింది. ఆ నలుగురికి మద్యం తాగే అలవాటు కూడా ఉందని తెలుసుకుని.. వారికి కూడా టీసీలు ఇచ్చి పంపేశారు. కాగా పోలీసుస్టేషన్‌ వద్ద ప్రిన్సిపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థికి.. అమ్మాయి కనిపిస్తే ఫొటో తీయడం, మార్ఫింగ్‌ చేయడం అలవాటు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసినట్లు అతడు అంగీకరించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన చేశారు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

Updated Date - Mar 13 , 2026 | 03:29 AM