బాలికలపై అత్యాచారం కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు
ABN , Publish Date - May 16 , 2026 | 05:03 AM
బాలికలపై అత్యాచారం చేసిన కేసుల్లో ఇద్దరు వేర్వేరు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ శుక్రవారం ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి.
కానిస్టేబుల్‌కి 31 ఏళ్ల జైలు.. మరొకరికి యావజ్జీవం
బోయినపల్లి, హైదరాబాద్ సిటీ/ చార్మినార్, మే 15 (ఆంధ్రజ్యోతి): బాలికలపై అత్యాచారం చేసిన కేసుల్లో ఇద్దరు వేర్వేరు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ శుక్రవారం ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. బోయినపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కానిస్టేబుల్‌కి 31 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 12 వేలు జరిమానా విధించింది. బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2020లో మధ్య మండల డీసీపీ వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరదరాజ్ సుధేశ్.. తాడ్‌బంద్ వద్ద నివాసముండే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యాచారం చేసి ఆమెను బెదిరించినట్టు కేసు నమోదు కాగా, కోర్టులో ఆరేళ్ల పాటు విచారణ కొనసాగింది. నిందితుడికి శిక్ష, జరిమానా విధించింది. కాగా, మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి రంగారెడ్డి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గర్భం దాల్చిన ఆ బాలికను భయపెట్టి, బలవంతంగా గర్భస్రావం చేయించిన మరో ఇద్దరికి మూడేళ్ల కారాగార శిక్ష వేసింది. బాలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్తతో విబేధాలు రావడంతో ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి విడిగా ఉంటోంది. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ తన పెద్ద కుమార్తెను బంధువుల వద్ద ఉంచేది. ఒంటరిగా ఉన్న బాలికను ఆమె సమీప బంధువైన మహ్మద్ అజీమ్ బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో బంధువులైన మహ్మద్ హలీం, జమీలా బేగంలు చంపుతామని బెదిరించి, మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రధాన నిందితుడు మహ్మద్ అజీమ్‌కు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 22 వేలు జరిమానా విధించింది. గర్భస్రావం చేయించిన మహ్మద్ హలీం, జమీలా బేగంలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా వేసింది.