రైతుబీమా డబ్బుల కోసం కన్నకొడుకు దాష్టీకం
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:34 AM
ఆస్తి, రైతుబీమా డబ్బుల కోసం కన్నకొడుకే కసాయిలా మారాడు. నిద్రిస్తున్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రూఫ్‌సింగ్ ...
తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పు
ఇద్దరి పరిస్థితి మిషమం.. మరో ఇద్దరికి గాయాలు
వికారాబాద్ జిల్లా రూఫ్‌సింగ్ తండాలో దారుణం
పరిగి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆస్తి, రైతుబీమా డబ్బుల కోసం కన్నకొడుకే కసాయిలా మారాడు. నిద్రిస్తున్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రూఫ్‌సింగ్ తండాలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. తండాకు చెందిన ఎం.హన్మంత్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతిబాయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె పేరిట వచ్చిన రైతుబీమా డబ్బులు (రూ.5 లక్షలు) హన్మంత్ ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బుతో పాటు, ఆస్తిలో వాటా కోసం నాతిబాయి కుమారుడు అనార్‌సింగ్ తండ్రితో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో తనని పట్టించుకోవడం లేదన్న కక్షతో, మొత్తం కుటుంబాన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో అనార్‌సింగ్ బయట నుంచి తలుపులకు తాళం వేశాడు. అనంతరం ఇంటి పైకప్పు రంధ్రం (గవాసు) ద్వారా లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో లోపల ఉన్న హన్మంత్, రెండో భార్య రమణిబాయి (సర్పంచ్), కుమారులు వెంకటేశ్, శివలు బయటకు రాలేక హాహాకారాలు చేశారు. గమనించిన తండావాసులు వెంటనే స్పందించి, వారిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమణిబాయి, వెంకటేశ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హన్మంత్, శివలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన అనార్‌సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.