Share News

తల్లి తలను పూజాబల్లకేసి కొట్టాడు

ABN , Publish Date - Jun 22 , 2026 | 06:00 AM

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో దారుణం చోటుచేసుకుంది. మంచినీరు తీసుకురావడం ఆలస్యమైందంటూ తల్లి తలను పూజామందిరం బల్లకు విసిరికొట్టాడు.

తల్లి తలను పూజాబల్లకేసి కొట్టాడు

  • మంచినీళ్లు తేవడం ఆలస్యమైందని కొడుకు ఘాతుకం

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి

పిఠాపురం రూరల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో దారుణం చోటుచేసుకుంది. మంచినీరు తీసుకురావడం ఆలస్యమైందంటూ తల్లి తలను పూజామందిరం బల్లకు విసిరికొట్టాడు ఆమె సుపుత్రుడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ఇలా ఉంది. చిత్రాడ గ్రామానికి చెందిన 26 ఏళ్ల పెంటా రాజబాబు పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. ఈ నెల 9న భోజనం చేస్తూ తల్లి నాగమణి(45)ని తాగడానికి మంచినీళ్లు తేవాలని అడిగాడు. ఆమె రావడం ఆలస్యమవుతోందంటూ లేచి లోపలికి వెళ్తుండగా.. అతనితలకు గుమ్మం తగిలింది. ఆగ్రహానికి గురైన రాజబాబు.. నీవల్లే నా తలకు దెబ్బతగిలిందంటూ.. విచక్షణ కోల్పోయి నాగమణి తల పట్టుకుని పూజా మందిరం బల్లకు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావమై కింద పడిపోయింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నిందితుడి తండ్రి త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 22 , 2026 | 06:01 AM