ప్రసవించాక బిడ్డను భవనం కిటికీలోంచి విసిరేసి..
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:38 AM
గోల్కొండ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మైనారిటీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన ఓ ఇంటర్ విద్యార్థిని వసతి గృహం మూడో ...
గురుకులంలో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని
శిశువు మృతి.. గోల్కొండ మైనారిటీ హాస్టల్‌లో ఘటన
హైదరాబాద్ సిటీ/కార్వాన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గోల్కొండ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మైనారిటీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన ఓ ఇంటర్ విద్యార్థిని వసతి గృహం మూడో అంతస్తులోని వాష్‌రూమ్‌లో బుధవారం ప్రసవించింది. విషయం వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ఆ పసిగుడ్డును ఆ బాలిక కిటీకీలోంచి బయటకు విసిరేసింది. దాంతో ఆ చిన్నారి కళ్లు తెరవకుండానే కన్నుమూసింది. గోల్కొండ పోలీసులు, హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన బాలిక గోల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. గతంలో కూడా ఇదే వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తిచేసింది. ఇటీవల వేసని సెలవులు పూర్తిచేసుకున్న విద్యార్థిని రెండవ సంవత్సరం చదివేందుకు పది రోజుల క్రితం ఇంటి నుంచి హాస్టల్‌కు చేరుకుంది. అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న బాలిక విషయాన్ని దాచిపెట్టి మంగళవారం ఉదయం హాస్టల్ మూడో అంతస్తులోని బాత్‌రూంలో ప్రసవించింది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆ నవజాత శిశువును ఒక బాక్సులో వేసుకొని తన రూమ్‌లోకి తీసుకొచ్చి వెంటిలేటర్ నుంచి కింద పడవేసింది. ఈ విషయం గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ నిర్వాహకులకు సమాచార మిచ్చారు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు గోల్కొండ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే బాలిక ప్రసవం అనంతరం అస్వస్థతకు గురవడంతో ఆమెను, చనిపోయిన శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై గోల్కొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంటర్ చదవుతున్న సదరు బాలిక, తన బావతో కొన్నాళ్లుగా కలిసి ఉంటోందని.. అతడి కారణంగానే గర్భం దాల్చి ఉంటుందని పోలీసులకు పలువురు తెలిపారు. ఘటనపై ప్రిన్సిపల్ పర్వీన్ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.