ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేశారు!
ABN , Publish Date - May 21 , 2026 | 04:06 AM
కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని బోరుబావిలోకి పడేసిన ఘటన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం...
కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని యువకుడిని దారుణంగా హత్యచేసిన తల్లిదండ్రులు
నిందితుల అరెస్ట్.. ఎర్రగొండపాలెంలో ఘటన
ఎర్రగొండపాలెం రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని బోరుబావిలోకి పడేసిన ఘటన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో వెలుగుచూసింది. కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ నాగరాజు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో స్థానిక గాయత్రి థియేటర్ వద్ద అక్కాబావతో కలిసి దిగుడు ఆంజనేయులు (21) నివసిస్తున్నాడు. ఈ నెల 13న అందరూ కలసి ఎస్టీ కాలనీలో వివాహ కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బజారుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆంజనేయులు అప్పటి నుంచి కనిపించలేదు. దీంతో అతని బావ చల్లె వెంకటరావు ఈ నెల 16న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బుధవారం పెద్దారవీడు మండలం బోరెడ్డిపల్లి జంక్షన్ వద్ద భార్యాభర్తలు ఆవుల వెంకటనారాయణ, రవణను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఘోరం వెలుగుచూసింది. ఈ నెల 13 రాత్రి ఎర్రగొండపాలెం ఇందిరమ్మ కాలనీలోని తమ నివాసంలో వారి కుమార్తెతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని చూశారు. కోపంతో ఆంజనేయులు తలపై అట్లపెనంతో మోదగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ రాత్రంతా ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి, మరునాడు రాత్రి పుల్లలచెరువు రోడ్డులోని(షీలా స్కూల్) వెనుక నిర్జన ప్రదేశానికి తరలించారు. అక్కడ మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి సమీప పొలం వద్ద బోరుబావిలో పడేశారు. రక్తం మరకలను చెరిపేసి, దుస్తులను తగులబెట్టినట్టు నిందితులు విచారణలో అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. వారు తెలిపిన వివరాలతో ఆ ప్రాంతంలో డీఎస్పీ నాగరాజు, సీఐ అజయ్‌కుమార్, ఎస్‌ఐ దేవకుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గురువారం బోరుబావిలో ఉన్న శరీరభాగాలను బయటకు తీసి పంచనామా చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిందితులను అప్పజెప్పాలని స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.