మాఫియాలో చేరేందుకు.. కన్నతల్లినే చంపేశాడు
ABN , Publish Date - May 16 , 2026 | 05:46 AM
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని ప్రయోజకుడిని చేయాలని ఆ తల్లి ఆశపడింది. టీనేజ్ దశలో కొడుకు అదుపుతప్పుతాడేమోనన్న భయంతో ఆంక్షల పేరుతో కాస్త కఠినంగా వ్యవహరించింది.
స్నేహితుడితో కలిసి తల్లిని హత్యచేసిన బాలుడు
నగదు, తొమ్మిదిన్నర తులాల బంగారంతో పరారీ
తొలుత ముంబైకి.. అక్కడి నుంచి తిరుపతికి..
తిరుపతిలో అదుపులోకి తీసుకున్న పొలీసులు
విజయనగరం జిల్లాలో హత్యకేసును ఛేదించిన పోలీసులు
రాజాం రూరల్, మే 15(ఆంధ్రజ్యోతి): అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని ప్రయోజకుడిని చేయాలని ఆ తల్లి ఆశపడింది. టీనేజ్ దశలో కొడుకు అదుపుతప్పుతాడేమోనన్న భయంతో ఆంక్షల పేరుతో కాస్త కఠినంగా వ్యవహరించింది. అదే ఆమె పాలిట మృత్యుపాశమైంది. రాజాం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రాఘవులు శుక్రవారం విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు... రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట ముంజేటి వీధికి చెందిన స్పందన కుమారుడు(16) ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కొడుకు గాడి తప్పుతాడన్న భయంతో ఆమె.. అడుగడుగునా నిబంధనలు విధిస్తూ కఠినంగా వ్యవహరించింది. ఆ బాలుడు దీన్ని సహించలేకపోయాడు. ఇదే సమయంలో తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తల్లికి చెప్పగా... ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో స్పందన కొడుకు ఈ నెల 4న తన స్నేహితుడిని తీసుకుకొచ్చాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి పిలిపించాడు. ‘మా అమ్మ ఇంటికి రాగానే బాత్‌రూంకి వెళ్తుంది. నువ్వు అక్కడే ఉండి ఆమెను చంపెయ్’ అని స్నేహితుడికి సూచించాడు. ఇంటికి రాగానే బాత్‌రూమ్‌కు వెళ్లిన స్పందనను... అక్కడే మాటువేసిన బాలుడు గట్టిగా పట్టుకుని నోరు మూశాడు. పెనుగులాటలో స్పందన బాత్‌రూమ్‌లో కిందపడిపోయింది. దీంతో ఆమె కొడుకు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి రెండు చాకులతో ఆమె శరీరంపై 12 నుంచి 15 సార్లు పొడిచారు. ఇద్దరూ బాత్‌రూంలో రక్తాన్ని శుభ్రం చేశారు. మృతదేహాన్ని ఇంటివెనుక ఉన్న చెరువువద్ద ముళ్లపొదల్లో పడవేశారు.
చాకుల్ని దూరంగా పారేశారు. బట్టలు మార్చుకుని ఇంట్లోని తొమ్మిదిన్నర తులాల బంగారం, ఐదు వేల నగదు, స్పందన మొబైల్‌ను తీసుకుని పరారయ్యారు. ముంబై వెళ్లి మాఫియాలో చేరాలనే ఉద్దేశంతో.. ఇద్దరూ తొలుత పలాస ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ స్నేహితుడి వద్ద ఈనెల 4న రాత్రి బస చేశారు. అక్కడి నుంచి నేరుగా ముంబైకి వెళ్లారు. ఇద్దరూ ఇన్‌స్టాలో స్నేహితులకు మెసేజ్ చేసేవారు. వీరి కదలికలను గుర్తించిన పొలీసులు పలాస ప్రాంతంలో వీరికి ఆశ్రయమిచ్చిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో వారు ముంబైలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అక్కడ వీరు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి స్థానిక పొలీసుల సహకారం కోరారు. ఇంతలో వారు అక్కడి పొలీసుల కన్నుకప్పి నేరుగా తిరుపతి చేరుకున్నారు. వారి కదలికలను గుర్తించిన రాజాం పోలీస్ బృందం తిరుమల, తిరుపతి పొలీసుల సహకారంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు. రాజాం ఆసుపత్రిలో ఇద్దరికీ వైద్యపరీక్షలు నిర్వహించి శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలోని జువైనల్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.