‘శక్తి’ యాప్‌తో సేఫ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:42 AM
శక్తి యాప్ వినియోగంతో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు ఓ యువతిని సకాలంలో రక్షించి, నిందితుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన యువతి
యాప్‌లో మెసేజ్‌తో స్పందించిన మంగళగిరి పోలీసులు
లైవ్ ట్రాక్ ద్వారా సకాలంలో ఘటనా స్థలానికి..అత్యాచార యత్నం చేసిన ఆటో డ్రైవర్ అరెస్టు
మంగళగిరి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): శక్తి యాప్ వినియోగంతో గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు ఓ యువతిని సకాలంలో రక్షించి, నిందితుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మంగళగిరి రూరల్ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్ కథనం ప్రకారం.. ఓ యువతి బెంగళూరు నుంచి గురువారం అర్ధరాత్రి విజయవాడ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని మంగళగిరి దాటి చినకాకాని సమీపానికి తీసుకువచ్చాడు. అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడగా భయాందోళనకు గురైన యువతి సమయోచితంగా శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సిబ్బందితో లైవ్ ట్రాక్ లొకేషన్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. నిందితుడైన తాడేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ బి.ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి పంపినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, శక్తి యాప్ మెజేస్‌కు వెంటనే స్పందించి యువతిని రక్షించిన మంగళగరి పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.