Share News

‘సంగం’లో మహిళగా నటించి..

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:01 AM

‘సంగం మ్యాట్రిమోనీ’లో మహిళ ఫొటోలతో నకిలీ ప్రొఫైల్‌ తయారుచేసి.. వధువును అన్వేషిస్తున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

‘సంగం’లో మహిళగా నటించి..

  • పెళ్లి చేసుకుందామని నమ్మించి...

  • ట్రేడింగ్‌లోకి దించి రూ.1.46కోట్లు కొట్టేసిన సైబర్‌ ముఠా

  • ఆ ముఠాకు మ్యూల్‌ ఖాతాలిచ్చిన నలుగురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘సంగం మ్యాట్రిమోనీ’లో మహిళ ఫొటోలతో నకిలీ ప్రొఫైల్‌ తయారుచేసి.. వధువును అన్వేషిస్తున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పెళ్లికి ముందే రూ.కోట్లు సంపాదించుకుందామని ఎర వేసి.. పెట్టుబడుల పేరిట ఓ సైబర్‌ నేర ముఠా అందినకాడికి దోచుకుంటుంది. సింగపూర్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ ముఠా వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.1.46 కోట్లు కొల్లగొట్టింది. కమీషన్‌కు కక్కుర్తి పడి ఈ ముఠాకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు(మోసపూరితంగా తీసినవి) ఇచ్చిన రాష్ట్రానికి చెందిన నలుగురు సైబర్‌ నేరగాళ్లు కటకటాల పాలయ్యారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ ముఠా బాధితుడైన ఓ వ్యక్తికి ‘సంగం మ్యాట్రిమోనీ’ ప్లాట్‌ఫామ్‌లో ఓ మహిళ పరిచయమైంది. ప్రొఫైల్‌ నచ్చిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకుంది. పెళ్లికి ముందే రూ. కోట్లు సంపాదించుకుందామని, తన వద్ద మంచి ప్లాన్‌ ఉందంటూ ఓ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఆ నకిలీ వధువు మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా వివిధ బ్యాంక్‌ ఖాతాల్లోకి మొత్తం రూ.46.65 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత డబ్బును విత్‌ డ్రా చేసుకునేందుకు యత్నించగా.. రుసుములు చెల్లించాలంటూ అవతలి వ్యక్తులు విత్‌డ్రాను అడ్డుకున్నారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. విదేశాల్లో ఉంటున్న సైబర్‌ ముఠా ఇదే తరహాలో మోసగించి వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.1.46 కోట్లు కొల్లగొట్టినట్టు కనుగొన్నారు. ఆ డబ్బును తరలించేందుకు 30 శాతం కమీషన్‌ తీసుకొని ఈ ముఠాకు మ్యూల్‌ ఖాతాలిచ్చిన సిద్దిపేటకు చెందిన చొక్కాల సంపత్‌, సికింద్రాబాద్‌కు చెందిన హెచ్చు నరేష్‌, ఎండ్ల సురేష్‌, వడ్కల మహే్‌షను అరెస్టు చేశారు. నిందితులు అందజేసిన ఇండియన్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 35లక్షలు డబ్బులు చేతులు మారినట్లు తేలింది.

Updated Date - Jun 27 , 2026 | 07:03 AM