Share News

రైలు ఢీకొని ఇద్దరు యువతుల మృతి

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:30 AM

వంట చెరుకు కోసం వెళ్లిన ఇద్దరు వలస కూలీల కుమార్తెలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కట్టెల మోపులతో పట్టాలు దాటుతుండగా రైలు...

రైలు ఢీకొని ఇద్దరు యువతుల మృతి

  • రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో ఘటన

కొత్తూర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): వంట చెరుకు కోసం వెళ్లిన ఇద్దరు వలస కూలీల కుమార్తెలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కట్టెల మోపులతో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం శివారులో అదివారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన పింటుపర్‌స్వాన్‌, సంజయ్‌ మోహన్‌ ముకియా అనే వ్యక్తులు ఉపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వచ్చారు. వీరు నందిగామ శివారులోని స్థానిక పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం పింటుపర్‌స్వాన్‌ కుమార్తె ప్రీతి (22), సంజయ్‌ మెహన్‌ ముకియా కుమార్తె చున్‌మూన్‌కుమారి (15) వంట చెరుకు (కట్టెలు) కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కట్టెల మోపులను తలపై పెట్టుకుని నందిగామ శివారులో రైలు పట్టాలు దాటేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాద్‌నగర్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు ఒక గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఆ గూడ్స్‌ రైలు వెళ్లిపోవడాన్ని గమనించిన యువతులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకొచ్చింది. తలపై కట్టెల మోపు ఉండడంతో వారు రైలు వస్తున్న విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన లోక్‌పైలట్‌ శ్రీనివాస్‌ వెంటనే షాద్‌నగర్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన యువతులను పోలీసులు షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Updated Date - Jun 01 , 2026 | 04:32 AM