బాలికను మోసగించిన కేసులో.. 20 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:13 AM
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు చిర్రా ఆనందకుమార్‌కు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడలోని..
రాజానగరం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు చిర్రా ఆనందకుమార్‌కు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడలోని పోక్సో న్యాయస్థానం తీర్పు చెప్పినట్టు సీఐ ఎస్.ప్రసన్నవీరయ్యగౌడ్ మంగళవారం తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామానికి చెందిన ఆనందకుమార్ 2020 సంవత్సరంలో ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కాకినాడ పోక్సో కోర్టులో ప్రత్యేక పీపీ శ్రీదేవి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. అలాగే ఐపీసీ 363 కింద నిందితుడికి మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారని చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని న్యాయస్థానం పేర్కొన్నట్టు సీఐ తెలిపారు. పోక్సో, ఐపీసీ 363 కింద విధించిన రెండు ప్రధాన శిక్షలు ఏకకాలంలో అమలు జరుగుతాయన్నారు.