Share News

కాబోయే భార్యే లోయలోకి తోసేసింది!

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:37 AM

మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ మృతిచెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది.

కాబోయే భార్యే లోయలోకి తోసేసింది!

  • పుణె వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్‌

  • ప్రియుడితో కలిసి ఘోరం

పుణె, జూన్‌ 23: మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ మృతిచెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది. అది ప్రమాదం కాదు.. కాబోయే భార్యే ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన దారుణ హత్య అని పోలీసులు తేల్చారు. తన పుట్టిన రోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగఢ్‌ కోట వద్దకు తీసుకెళ్లి, వెనుక నుంచి 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపినట్లు నిర్ధారించారు. ఈ కేసులో కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్‌, ఆమె ప్రియుడు చేతన్‌ చౌదరిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ (26) తన కుటుంబానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నాడు. కేతన్‌కు, సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌ 25న జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఒక లగ్జరీ ప్యాలె్‌సను రూ.17 కోట్లకు బుక్‌ చేసి, అతిథుల కోసం రెండు చార్టర్డ్‌ విమానాలను కూడా సిద్ధం చేశారు. కాగా, జూన్‌ 19న సియా పుట్టినరోజు కావడంతో, జూన్‌ 18న ఆమె కేతన్‌ను లోహగఢ్‌ కోటకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లింది. అయితే అక్కడ కేతన్‌ తనను ఫొటోలు తీస్తుండగా బలమైన గాలులకు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు.


ఇంటికొచ్చి బుక్కైన కిల్లర్‌!

కేతన్‌ మంచి ట్రెక్కర్‌ కావడంతో అంత సులభంగా కాలుజారి పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కేతన్‌ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ కేతన్‌ సోదరి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె తడబడుతూ సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఆధారాలను పరిశీలించారు. పోలీసుల దర్యాప్తులో సియాకు పుణెలోని కొంధ్వాకు చెందిన చేతన్‌ బాబూలాల్‌ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. గత ఆరు నెలల్లో వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్‌ 18న చేతన్‌ తన మొబైల్‌ డేటాను పూర్తిగా ఆఫ్‌ చేసి, తన ఫోన్‌ను సొంత షాపులోనే వదిలేశాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తన షాప్‌ ఉద్యోగి ఫోన్‌ తీసుకుని రహస్యంగా లోహగఢ్‌ కోటకు చేరుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, చేతన్‌తో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని స్కెచ్‌ వేసింది. జూన్‌ 14నే అతడిని కొండపై నుంచి నెట్టేయాలని చూశారు కానీ అది కుదరలేదు. దీంతో మళ్లీ జూన్‌ 18న బర్త్‌డే నెపంతో కొండపైకి తీసుకెళ్లి, వెనుక నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సియా ఇన్‌స్టాగ్రామ్‌లో కేతన్‌తో ఉన్న పాత వీడియోలను షేర్‌ చేస్తూ ‘‘నా పుట్టినరోజే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, తిరిగి వచ్చేయ్‌’’ అంటూ పోస్ట్‌లు పెట్టింది. నిందితులిద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jun 24 , 2026 | 03:37 AM