సైకో వీరంగం
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:38 AM
సైకోలా ప్రవ ర్తిస్తూ, కొడవలితో దాడికి పాల్పడుతున్న ఓ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేయగా గాయాలపాలై మృతిచెందాడు.
గ్రామస్థుల దాడిలో మృతి
అర్ధరాత్రి వాహనాలు ధ్వంసం
పోలీసుల నుంచి తప్పించుకుని ఓ వ్యక్తిపై కొడవలితో దాడి
బంధించే క్రమంలో ప్రతిదాడి చేసిన గ్రామస్థులు
శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
చిలమత్తూరు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): సైకోలా ప్రవ ర్తిస్తూ, కొడవలితో దాడికి పాల్పడుతున్న ఓ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేయగా గాయాలపాలై మృతిచెందాడు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బావిరెడ్డి (48) 2007లో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ఆరేళ్లు జైళు శిక్ష అనుభవించి వచ్చాడు. అప్పటి నుంచి అతని మానసిక స్థితి బాగోలేదని గ్రామస్థులు అంటున్నారు. పెళ్లయిన నెలకే భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. కాగా, బావిరెడ్డి ఇంటిపక్కన ఇద్దరు వ్యక్తులు కార్లు ఆపి ఉంచగా శనివారం అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి అద్దాలు, లోపల భాగాలను ధ్వంసం చేశాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకోగా బావిరెడ్డి సమీప పొలాల్లోకి పారిపోయాడు. పోలీసులు గాలించినా అతడు దొరకలేదు. దీంతో వారు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నేసే నారాయణప్ప పశువుల మేత కోసం కొడవలి తీసుకుని, పొలం వద్దకు బయల్దేరాడు. పొలంలో దాగివున్న బావిరెడ్డి.. నారాయణప్ప చేతిలో ఉన్న కొడవలిని లాక్కుని, విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నారాయణప్ప అరుచుకుంటూ ఊర్లోకి పరుగెత్తుకొచ్చాడు. బావిరెడ్డి కూడా కొడవలితో అతడిని వెంబడిస్తూ ఊర్లోకి వచ్చి, మళ్లీ దాడి చేశాడు. దీంతో గ్రామస్థు లు బావిరెడ్డిని తాళ్లతో బంధించే క్రమంలో పలువురు దాడి చేశారు. తోపులాటలో కిందపడిన బావిరెడ్డి ముఖంపై తీవ్ర గాయాలై చనిపోయాడు. దాడికి పాల్పడిన వారు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.