Share News

భార్య లావుగా ఉందని చంపేసిన భర్త

ABN , Publish Date - May 06 , 2026 | 04:53 AM

భార్యను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ వేసి.. పాలకోవాలో విషం కలిపి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించే యత్నం చేసి.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

భార్య లావుగా ఉందని చంపేసిన భర్త

  • యూట్యూబ్‌ చూసి.. పాలకోవాలో విషం కలిపి.. కడపలో ఘటన

ప్రొద్దుటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): భార్యను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ వేసి.. పాలకోవాలో విషం కలిపి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించే యత్నం చేసి.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. మంగళవారం ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన బద్రిపల్లె కిరణ్‌ (35)కు కడప జిల్లా ముద్దనూరుకు చెందిన పద్మజతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. కిరణ్‌ ముద్దనూరులోనే భార్య, అత్తమామలతో ఉండేవాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే కిరణ్‌, ఐదేళ్లుగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్నాడు. గత నెల 24న ప్రొద్దుటూరులో తన తల్లిదండ్రులను చూడటానికి భార్యతో వచ్చాడు. రాత్రి నిద్రకు ఉపక్రమించాక భార్య తన పక్కన లేదని.. వెతకగా బాత్రూంలో పడిపోయిందని వెంటనే అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరీక్షించి అప్పటికే మరణించిందని చెప్పారని కట్టు కథ అల్లాడు. ఆమె తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో పద్మజపై విషప్రయోగం జరిగిందని తేలింది. భార్యకు పాలకోవాలో విషం కలిపి ఇచ్చి హత్య చేసినట్లు కిరణ్‌ విచారణలో అంగీకరించాడు. తన భార్య ఊబకాయురాలని, ఎప్పుడూ ఫాస్టుఫుడ్‌ కావాలని వేధించేదని.. అందుకే తాను వేరే మహిళను ప్రేమించానని, ఆ విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని తెలిపాడు. భార్యను చంపడానికి యూట్యూబ్‌లో వీడియోలు చూసి విషద్రావణం కొని.. పాలకోవాలో పెట్టి తినిపించి.. ఆమె మత్తులోకి వెళ్లాక దిండు ముఖం మీద అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కిరణ్‌ను హత్యా నేరం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 04:54 AM