ఆటోను ఢీకొట్టిన గంజాయి ముఠా కారు
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:43 AM
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా కారు ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరు కూలీల దుర్మరణం.. మృతులిద్దరూ అన్నదమ్ములు
కారు, గంజాయి బ్యాగులు వదిలేసి స్మగ్లర్లు పరార్
కందుకూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా కారు ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం వీరేపల్లి చెన్నై - కోల్‌కత్తా హైవేపై శనివారం ఈ దారునం చోటుచేసుకుంది. వివరాలిలా.. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం వీరేపల్లి పంచాయతీలోని తూర్పు రైలుకట్ట సంఘానికి చెందిన ఏడుగురు కూలీలు ఆటోలో సమీప ఫారెస్టులో జామాయిల్ కర్రకోత కోసం బయల్దేరారు. ఉదయం 7గంటల ప్రాంతంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తాకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా కారులో ఉన్న ముగ్గురు కారు దిగి అందులో ఉన్న గంజాయి బ్యాగులను సమీప కల్వర్టులో పడేసి పరారయ్యారు. ఆటోలో ఉన్న వారిలో యాకసిరి వెంకయ్య (50) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన సోదరుడు యాకసిరి రాములు (55) కావలి వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వారి మరో సోదరుడైన యాకసిరి నాగేశ్వరరావు నెల్లూరు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ముగ్గురన్నదమ్ములూ ఒకే ఆటోలో పనికి వెళ్తూ ప్రమాదం బారిన పడటం, ఇద్దరు మృతిచెందగా మరో సోదరుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తూర్పు రైలుకట్ట సంఘంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. అదేకాలనీకి చెందిన ఇండ్ల పోలయ్య, ఆటో డ్రైవరు సుల్తాన్ బాషాల పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మిగిలిన ముగ్గురికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. గుడ్లూరు పోలీసులు కారుతోపాటు రెండు గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లో 60కిలోల వరకు గంజాయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్నందున చెన్నైకి చెందిన ముఠాగా అనుమానిస్తున్నట్లు కందుకూరు పోలీసులు తెలిపారు. డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.