జంట హత్యల కేసులో మరోమారు..పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:42 AM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ పోలీసులు మరోమారు విచారించనున్నారు.
నేడు ప్రశ్నించనున్న మాచర్ల రూరల్ పోలీసులు
మాచర్ల, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ పోలీసులు మరోమారు విచారించనున్నారు. గతంలో రెండుసార్లు వీరిని పోలీసులు విచారించారు. తాజాగా శుక్రవారం ఒక్కరోజు విచారించేందుకు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి శ్రీనివాస్ కల్యాణ్ పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో మాచర్ల రూరల్ పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లి పిన్నెల్లి సోదరులను శుక్రవారం విచారించనున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జెవిశెట్టి కోటేశ్వరరావు గతేడాది మే నెల 24వ తేదీన హత్యకు గురయ్యారు. ఈ కేసులో రామకృష్ణారెడ్డి(ఏ6), వెంకట్రామిరెడ్డి(ఏ7) నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరు నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.