Share News

బాలికపై పాస్టర్‌ అత్యాచారం

ABN , Publish Date - May 09 , 2026 | 03:57 AM

ఏలూరు జిల్లాలో ఓ పాస్టర్‌ మానవత్వాన్ని మరిచి బాలిక జీవితాన్ని చెరబట్టాడు. ప్రార్థనల కోసం తన చర్చికి వచ్చిన బాలికపై కన్నేసి పలుమార్లు అత్యాచారం చేశాడు.

బాలికపై పాస్టర్‌ అత్యాచారం

  • ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడని బెదిరించి మరీ అఘాయిత్యం

  • పిల్లలు, మహిళల పట్ల దయతో

  • ఉండాలంటూనే 4 నెలలుగా దారుణం

  • గతంలోనూ మహిళలపై అకృత్యాలు

  • ఏలూరు జిల్లాలో ఘోరం

కామవరపుకోట, మే 8(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో ఓ పాస్టర్‌ మానవత్వాన్ని మరిచి బాలిక జీవితాన్ని చెరబట్టాడు. ప్రార్థనల కోసం తన చర్చికి వచ్చిన బాలికపై కన్నేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే దేవుడు శిక్షిస్తాడని బెదిరించి, తన కామవాంఛ తీర్చుకున్నాడు. పోలీసులు, బాధితు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్లచెరువు గ్రామంలో చౌటపల్లి రాంబాబు(42) అనే వ్యక్తి చర్చి ఏర్పాటు చేశాడు. చాలా కాలంగా దేవుడి బోధనలు చెబుతూ విశ్వాసులను ఆకట్టుకునే వాడు. మహిళలు, పిల్లల పట్ల ఎంతో దయతో వుండాలని తరచూ బోధించేవాడు. ఇలా నీతులు చెబుతూనే.. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో లొంగదీసుకుని గడచిన నాలుగు నెలలుగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కొద్ది రోజులుగా నెలసరి సరిగా రాకపోవడంతో పాస్టర్‌ ఆమెతో గర్భనిరోధక మాత్రలు వాడించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటికి పొక్కి, తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు తడికలపూడి ఎస్‌ఐ వల్లీ పద్మ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. కాగా, పాస్టర్‌ రాంబాబుతో గొడవ పడి చాలా కాలం క్రితమే భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాస్టర్‌ వంటరిగానే ఉంటున్నాడు. గతంలో ఆసినగూడెంలో పాస్టర్‌గా పనిచేసిన సమయంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామ పెద్దలు అతన్ని మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. తాజాగా కాళ్లచెరువు ఘటన నేపథ్యంలో అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 09 , 2026 | 03:58 AM