Share News

సీనియర్‌ వైద్యుల వేధింపులు.. పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:06 AM

ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ పీజీ వైద్య విద్యార్థి.. సీనియర్‌ వైద్యుల నుంచి ఎదురైన కులపరమైన వేధింపుల కారణంగా నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా ఆసుపత్రి పీజీ క్వార్టర్స్‌లో ....

సీనియర్‌ వైద్యుల వేధింపులు.. పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

  • ఉస్మానియా ఆస్పత్రి హాస్టల్‌లో దారుణం

  • నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డ గిరిజన యువకుడు డాక్టర్‌ సురేష్‌

  • కులపరమైన వివక్ష, ర్యాగింగ్‌పై తల్లికి తరచూ ఫోన్‌

  • అదనపు డ్యూటీలు వేసి పని ఒత్తిడి పెంచుతున్నట్లు వెల్లడి

  • ఘటనపై పోలీసుల దర్యాప్తు

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ పీజీ వైద్య విద్యార్థి.. సీనియర్‌ వైద్యుల నుంచి ఎదురైన కులపరమైన వేధింపుల కారణంగా నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా ఆసుపత్రి పీజీ క్వార్టర్స్‌లో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. జనరల్‌ సర్జరీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి డాక్టర్‌ సురేష్‌ నిద్రమాత్రలు మింగి, మత్తు ఇంజెక్షన్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెంది న 29 ఏళ్ల డాక్టర్‌ కాట్రావత్‌ సురేష్‌ నాయక్‌.. ఇటీవలే పీజీ ప్రథమ సంవత్సరంలో చేరారు. మూడు నెలలుగా ఉస్మానియా ఆసుపత్రిలోని పీజీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన సీనియర్‌ వైద్యు లు కావాలని తనకు అదనపు డ్యూటీలు వేస్తున్నారని, తీవ్రమైన పని ఒత్తిడికి గురి చేస్తున్నారని తల్లి నాగమణికి ఫోన్‌లో చెప్పి సురేష్‌ వాపోయేవాడు. ఎంతో విలువైన మెడికల్‌ పీజీ సీటు రిజర్వేషన్‌ కారణంగా సులువుగా దొరికిందంటూ తనను ర్యాగిం గ్‌ చేస్తుంటారని, ప్రతి చిన్న విషయానికి అవమానిస్తుంటారని చెప్పేవాడు. ఆస్పత్రితోపాటు, హాస్టల్‌లో కూడా తనకు ఇటువంటి అవమానాలే ఎదురవుతున్నాయని ఆవేదన చెందేవాడు. దీంతో నాగమణి తన సోదరుడు రవిని సురే ష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పటానికి ఇటీవల పంపించారు. రవి హాస్టల్‌కు వచ్చి సురేష్‌తో మాట్లాడి, వేధిస్తున్న వారిని కలిసి అలా ఎందుకు చేస్తున్నారో అడుగుతానని చెప్పారు. కానీ, డాక్టర్‌ సురేష్‌ అందుకు అంగీకరించలేదని సమాచారం. అలాగైతే వాళ్లు తనని మరింత వేధిస్తారని, ఈ విషయం తానే చూసుకుంటానని చెప్పి మేనమామను పంపించి వేశాడు.


తనకు రోజూ ఉదయం సాయంత్రం ఫోన్‌చేసే సురేష్‌.. మరోసారి మామను పంపకు, నేనే చూసుకుంటాను అని ప్రాధేయపడ్డాడని తల్లి నాగమణి రోదిస్తూ తెలిపారు. గురువారం ఉదయం 7.30గంటలకు కూడా డ్యూటీకి వెళ్తున్నానని తెలిపాడని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9 గంటలవుతున్నా సురేష్‌ గది నుంచి బయటకు రాకపోవటంతో.. సహచర విద్యార్థిని డాక్టర్‌ అమూల్య గదిలోకి వెళ్లి చూసేసరికి సురేష్‌ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని చుట్టూ నిద్రమాత్రలు పడి ఉన్నా యి. చేతికి తీసుకున్న ఇంజక్షన్‌ కూడా అలాగే ఉంది. సమాచారం తెలిసిన ఇతర విద్యార్థులు సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. సురేష్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకొని సురేష్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు అడ్డు తగిలారు. సురేష్‌ మృతికి సీనియర్‌ వైద్యులే కారణమని, వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి భవనం ముందు ధర్నాకు దిగారు. పోలీసు అధికారులు తరలివచ్చి వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

తండా ప్రజలకు సేవలందిస్తానని చెప్పేవాడు

గొప్ప డాక్టర్‌గా పేరుతెచ్చుకొని తమ తండాలో ఉన్న పేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తానని తన కొడుకు పదేపదే తనకు చెప్పేవాడని డాక్టర్‌ సురేష్‌ తల్లి నాగమణి వెల్లడించారు. సీనియర్ల వేధింపుల వల్ల మానసికంగా తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె గుండెలవిసేలా రోదించారు. మాట్లాడిన ప్రతిసారీ సీనియర్‌ వైద్యులు వేధిస్తున్నారని, భోజనం కూడా చేయనీయకుండా డ్యూటీలు వేస్తున్నారని వాపోయేవాడని తెలిపారు. వేరే హాస్టల్‌లో ఉండమని తాను చెప్పినా వినలేదని వాపోయారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై హత్యకేసు నమోదు చేయాలని, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశోక్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. కాకతీయ మెడికల్‌ కళాశాల విద్యార్థిని ప్రీతి మరణంలాగే ఇదీ ఉందని ఆరోపించారు.

Updated Date - Apr 17 , 2026 | 04:06 AM