మ్యూల్ ఖాతాల వేటకు జాతీయ కార్యాచరణ
ABN , Publish Date - May 01 , 2026 | 05:06 AM
సైబర్ నేరగాళ్ల మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో చేపట్టిన ఆపరేషన్ ఆక్టోప్‌సకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.
హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోప్‌సకు ఆదరణ
ఢిల్లీలో ఉన్నతాధికారులకు వివరించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో చేపట్టిన ఆపరేషన్ ఆక్టోప్‌సకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. దాంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను న్యూఢిల్లీకి కేంద్ర ఆర్ధిక సేవల విభాగం(డీఎ్‌ఫఎ్‌స)ఉన్నతాధికారులు గురువారం పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. మ్యూల్ ఖాతాలను అరికట్టడంతో పాటు మ్యూల్ ఖాతాలు తెరవడానికి సహకరిస్తున్న 32మంది బ్యాంక్ అధికారుల్ని సైతం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకోసం ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట అనుసరించిన వ్యూహన్ని డీఎఫ్ఎస్ ఒక జాతీయ నమూనాగా పరిగణనలోకి తీసుకుంది. కేంద్ర ఆర్ధిక సేవల కార్యదర్శి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాము అనుసరించిన వ్యూహం గురించి సమూలంగా వివరించారు. అమాయకుల పేరిట కేటుగాళ్లు మ్యూల్‌ఖాతాలు ఏవిధంగా తెరుస్తున్నారు? వీరికి బ్యాంకు అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు? ఆపై సైబర్ నేరగాళ్లు ఈ మ్యూల్ ఖాతాలను సైబర్ నేరాల డబ్బు బదిలీకి ఏవిధంగా వాడుకుంటున్నారన్న వివరాలను ఆధారాలతో సహ వివరించారు. హైదరాబాద్ పోలీసులు అందించిన క్షేత్ర సాఽ్ధయి నివేదికల ఆధారంగా సీబీఐ, ఐ4సీ, ఆర్‌బీఐ ఉన్నతాధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. సైబర్ నేరగాళ్లను వేటాడేందుకు మ్యూల్ హంటర్ ఏఐ అనే కృత్రిమ మేధస్సు వినియోగాన్ని అన్ని బ్యాంకులు అమల్లోకి తీసుకుని రావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.